30.12.09

పడుకున్నప్పుడు ముద్దు పెట్టాను




ఎవరికి అంటారా.. నా మరదలుకి. ఎప్పుడంటారా ముద్దొచ్చినప్పుడు. బాగా చెప్పాను కదా!

           నా మరదలుకి చాలా పేర్లు ఉన్నాయి. 'రాకాసి', 'భూతం', 'దెయ్యం'.. ఇవి తను అల్లరి చేసినప్పుడు మేము పిలిచే ముద్దు పేర్లు. ఇక 'బంగారం', 'బుజ్జి', 'తల్లీ', 'బంగారు తల్లీ'.. ఎప్పూడూ పిలిచే పేర్లు.

          ఇక తన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటీ చెప్తాను వినండి.

          మొదట ఏం చెప్దాం! ఆ... తన భోజనం గురించి చెప్తాను వినండి. ఎక్కడైనా ఇరవై రెండు నెలల పాప(అదేనండి మరో రెండు నెలలు నిండితే రెండు సంవత్సరాలు అవుతాయి) భోజనం చేయడం చూశారా! చూశాం అంటారేమో.. ఒకరు తినిపిస్తే తినడం కాదు. తనకు తనే తినడం అదీ సంవత్సరం వయసున్నప్పుడునుంచి!

         ఎలా అలవాటైందంటే.. మా అత్తయ్య తినిపించేటప్పుడు తను కూడా కంచంలో చెయ్యి పెట్టేది. అత్తయ్య అడ్డు చెప్పలేదు. కొన్నిరోజులయ్యాక మధ్యమధ్యలో ఒక్కో ముద్ద తినేది. మరి కొన్ని రోజులు పోయాక పూర్తిగా తనే తింటుంది. ఇప్పుడు మేం చెయ్యి పెడితే ఒప్పుకోదు. ఆ చెయ్యి కడుక్కున్నంతవరకూ గొడవే!
  
          తన భోజనం టైమ్ వేరు.. మా భోజనాల టైమ్ వేరు. మేము తినేటప్పుడు అది మా పక్కనే ఉంటే తినిపించేవాళ్లం. అలాగే తను తినేటప్పుడు అప్పుడప్పుడు మాకు తినిపించేది.

           ఒకసారి తను చేతితో ముద్ద తీసి నావైపు చూపించి " బావ! ఆ... " అంది నాకు తినిపించాలని.

           అది తినేదే ఇంతరవ్వ.. అదైనా పూర్తిగా తినాలని " నువ్వే తిను " అన్నాను.

          " ఆ.. " అని మళ్లీ నాకే నోరు తెరవమంది.

          " ఆమ్ చేసేయ్ తల్లీ! " అన్నాను.

          "ఆ.." అని మరొకసారి అంది. నేను వెళ్లకపోయేసరికి " నేను తినిపిస్తే తినవా.. నేనూ తినను." అనుకుని నామీద తనకున్న ప్రేమనంతా చూపించి ఆ ముద్దని విసిరికొట్టింది.

           అప్పటినుంచి తను తినిపించాలనుకున్న ప్రతీసారి.. నేను ఏం చేస్తున్నా, ఎంత దూరంలో ఉన్నా తన ముందుండేవాణ్ణి. మా అమ్మ, నాన్న పిలిచినప్పుడు కూడా అంతవేగంగా ఎప్పుడూ వెళ్లలేదు.

          ఇక రెండోది.. మా తల్లిగారికి తిరగడం అంటే చాలా ఇష్టం. " షికారు " అనే పదం వినపడగానే... ఏడుస్తున్నా, తింటున్నా, బట్టలు లేకపోయినా రెడీ ఐపోతుంది. అప్పటివరకూ ఉన్న ఏడుపంతా మాయమైపోతుంది.

          ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే "షికారు" అనగానే ఎవరితోనైనా వెళ్లిపోతుంది. మేమే ఉండవలసిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితం.. బహుశా అప్పుడు తనకి సంవత్సరం దాటి ఉంటుంది.

            ఒకరోజు రాత్రి మా మావయ్య స్నేహితుడు వేణు గారు వచ్చారు. ఆయన తిరిగి వెళ్తుండగా మేము కూడా బైటకు వెళ్లాం.

          "ఏయ్ నాతో వస్తావా! " అంటూ మా బంగారం వైపు చేతులు చాపారు. ఇది వెళ్లలేదు.

          " షికారు అనండి వస్తుంది " అని ఎవరమో చెప్పాం.

          " షికారు వెళ్దాం " అని ఆయన అన్నారు. వెంటనే వెళ్లొపోయింది. ఆయన బండిమీద ముందుకి కూర్చొండబెట్టుకొని వెళ్లిపోయారు.

           అప్పుడు రాత్రి 9-00 గంటలు. వీధిలో కరెంట్ లేదు. మేమేంటి ఆయన ఒక రౌండ్ వేసి తెచ్చేస్తారు అనుకున్నాం. కానీ ఎంతకీ రారు. పది నిమషాలైంది. ఐనా రారు. మేము అలా మాట్లాడుకుంటూ బైట ఉన్న మెట్లుమీద కూర్చున్నాం.

            అప్పటికి మరో పది నిమషాలు తరువాత చేతిలో "కాకీ"తో ప్రత్యక్షమైంది. కాకీ అంటే ఏంటో అనుకుంటున్నారా.. మా తల్లిగారి భాషలో చాక్లెట్.

           మాకు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వేరే వ్యక్తితో ఇరవై నిమషాలు ఎలా ఉండిపోయిందా అని.

            మరోసారి నేను మా తల్లిగారిని బండిమీద తీసుకెళ్లాను. కొంచం దూరం వెళ్లాను. అక్కడ పని ఐన తరువాత తిరిగి వస్తుండగా కొంతసేపట్లోనే.. బ్రేక్ వేస్తే చాలు ముందుకి తూలిపడిపోతుంది. ప్రతీసారీ అలాగే! నాకేం అర్థం కాలేదు. ఈ ట్రాఫిక్ లో మాటకి బ్రేక్ కొట్టాల్సివస్తుంది. ఇదేమో పడిపోతుంది. పోనీ ఒక్కచేత్తో తొక్కుదాం అంటే కుదరదు. గేర్ బళ్లు మనల్ని కష్టపెట్టందే ముందుకు సాగవు(బండిమీద దూరం వెళ్లినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది). ఎలాగో సగం దూరం వచ్చాక బండి పక్కన ఆపి ఎందుకు పడిపోతుందో చూసాను.

            చూసాక చిన్న షాక్ తగిలింది. తనేమో చక్కగా పడుకుండిపోయింది. అందుకే బ్రేక్ కొట్టిన ప్రతీసారి ముందుకు పడిపోతుంది. అప్పుడు కనిపించాయి చుక్కలు. ఇంకా సగం దూం ఉంది.

           అప్పటివరకూ ట్రాఫిక్ ని తిట్టని నేను.. దారిలో బండి అడ్డం వచ్చినా, కారు అడ్డం వచ్చినా వాళ్లని తిడుతూనే ఉన్నాను. " ఈ వెదవలకి డ్రైవింగ్ అస్సలు రాదు. అడ్డంగా వస్తున్నారు." అని తిట్టుకున్నాను. వాళ్లనే కాదు అడ్డంగా వస్తున్న మనుషులని చివరికి రోడ్డుని కూడా తిడుతూ ఇంటికి వస్తున్నాను.

          హమ్మయ్య ఇల్లు దగ్గరకి వచ్చేసింది అని అనుకుంటుండగా మూడు స్పీడ్ బేకర్లు అడ్డం వచ్చాయి. ఇల్లు దగ్గరకొచ్చినా నీ కష్టాలు తగ్గలేదు అని చెప్పాయి.

          మా వీధిలోనే స్కూల్ ఉండడంతో ఆ బేకర్లు పెట్టారు. ఆ స్కూల్ ని, బేకర్లుని తిట్టుకుంటూ ఇంటికి చేరేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.

           మరో విషయం ఏంటంటే తల్లిగారు ఈమధ్యనే చిక్కడం నేర్చుకుంది. ఒకసారి తనేదో చెప్పింది. నేను చెయ్యలేదు. అంతే కోపం వచ్చి చిక్కింది. " రాక్షసి " అన్నాను గట్టిగా... వాళ్ల నాన్న వచ్చి దాన్ని తీసుకుని " ఏం చేసింది " అన్నారు.


         " చిక్కీసింది " అని నా ముఖాన్నిచూపించాను. అప్పటికే నా బుగ్గమీద తట్టు లేచింది. మా మావయ్య అది చూసి తల్లిగారిచేత ముద్దు పెట్టించారు. ఎంత బాగా ముద్దు పెట్టిందంటే.. సంపెంగ పువ్వుపై సీతాకోకచిలుక వాలినట్లుగా సున్నితంగా ముద్దు పెట్టింది.

           ఇటువంటి నా మరదలు ... ఒకసారి నేను ఇంటికెళ్లేసరికి యువరాణిలా మంచం మీద పడుకుంది. దాని ఉంగరాల జుత్తు.. బుల్లి బుగ్గలు.. చిట్టి పెదవులు.. చూడగానే ముద్దు పెట్టేయాఅలనిపించింది(ఎవరి మరదలు వారికి ముద్దు).

            ఆ తరువాత నేను నెమ్మదిగా తన దగ్గరికి వెళ్లి తన నుదురుపై ముద్దు పెట్టాను. అది కదలకపోయేసరికి బుగ్గమీద ముద్దు పెట్టాను. మళ్లీ పెట్టాలనిపించింది కాని అదెక్కడ లెగిసిపోతుందో అని పెట్టలేదు.

           ఆ సమయంలో మన మనసు భలేగుంటుందే.. తల్లిగారిని లేపొద్దనిచెప్తుంటుంది. ముద్దులు పెట్టమనీచెప్తుంటుంది. ఏం చేస్తాం! కొన్ని క్షణాలు అంతే.. అందంగా ఆనందంగా ఉంటాయి.

ఇంతకీ మా బంగారు తల్లి పేరు చెప్పలేదు కదా.. ప్రణవి శ్రీ.

20.12.09

మా మావయ్య ముఖ్యమంత్రి..



కొన్ని రోజుల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఏకైక చర్చ జరుగుతోంది. నిజానికి దేశం మొత్తం మీద ఇదే చర్చ జరుగుతోంది. అదేనండి మన రాష్ట్ర విభజన గురించి.. అప్పుడు జరిగిన సంఘటనను చెప్తున్నాను వినండి.

            ఎలాగో ఒకలాగ చిదంబరం గారు అర్థరాత్రి తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని సెలవిచ్చారు. తరువాత చాలా పరిణామాలు జరిగాయి. సీమాంధ్ర ఎమ్.ఎల్.ఎ.లు ఒకేరోజు వంద మంది దాక రాజీనామా చేసారు. ఇది ఒక ఎత్తు ఐతే.. మరో పది రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ప్రారంభమవడం ఒక ఎత్తు. వీటికి మించి మన రాష్ట్రంలోనే చాలామంది వివిధ రకాలుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం పెద్ద ఎత్తు.

           వాటిలో ఓ రెండు.. 1) రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులతో కలిసి తిరుపతి రాజధానిగా ఒక రాష్ట్రం కావాలట. 2) మరో పెద్ద మనిషి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూ.గో., ప.గో.లతో కలిసి విశాఖ రాజధానిగా ఒక రాష్ట్రం కావాలని అన్నాడట..! ఇంకో పెద్దమనిషి ఇంకో రకంగా కోరాడట! ఇలాంటి చాలా ప్రస్థావనలను టి.వి.లో చూసాక.. ఉన్న మతి కాస్త పోయింది.

             మా మావయ్య వచ్చిన వెంటనే ఈ విషయం చెప్పాను.(మా మావయ్య గురించి చాలా చెప్పాలి.. తరువాత చెప్తాను.) తను కూడా చాలా ఆశ్చర్యపోయారు. అప్పటికే సీమాంధ్రాల్లో సమైక్యంగా ఉండాలని ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. అది టి.వి.లో చూస్తున్నాం.

            ఆ సమయంలో మా మావయ్యకి తన స్నేహితుడు కిరణ్ గారు ఫోన్ చేసారు. ఆయనది గుంటూరు. మాదేమో పలాస( శ్రీకాకుళం జిల్లా ). ఇరు పక్షాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.

            మా మావయ్య సెల్ ఆన్ చేసి " అక్కడ అందరూ ఉద్యమాలు చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అబ్బాయ్." అన్నారు సరదాగా!

            "మరి నువ్వేంటో" అన్నారు కిరణ్ గారు.

            "నేను పక్కా తెలంగాణ వాదిని... తెలంగాణియన్" అన్నారు ఒక కొత్త పదాన్ని ఉపయోగిస్తూ. అతను ఏమన్నారో తెలీదు కాని మా మావయ్య మంచి డైలాగ్ వేసారు. " అది కాదు కిరణ్.. నేను కూడా దీక్ష చేస్తాను గ్రేటర్ పలాస ఇస్తారా!" అన్నారు.( పలాస చిన్న మున్సిపాలిటి మాత్రమే) .

            "గ్రేటర్ పలాసా... " అని వెటకారంగా అన్నట్లున్నారు.

             "ఓ.కె.. ఓ.కె.. ప్రత్యేక పలాస ఇస్తారా!" అన్నారు.

             ఇంతలో మా బావ "ఆయన ప్రత్యేక గుంటూరు అడుగుతారు" అన్నాడు.(మా బావ పెద్ద మావయ్య కొడుకు. తను ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు చెప్తుంది చిన్న మావయ్య గురించి.. నాకు మ్పొత్తం నలుగురు మావయ్యలు).

             ఆ తరువాత మేము భోజనాలకి వెళ్లడం వల్ల ప్రత్యేక పలాస ఉద్యమాన్ని రద్దు చేసాం. లేకపోతే ఈపాటికే పలాస రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా మావయ్య.. ఉప ముఖ్యమంత్రిగా నేను.. ఇలా అన్ని పదవుల్లొనా మా కుటుంబం వాళ్లమే ఉండి చక్కని కుటుంబ పాలన సాగిస్తుండేవాళ్లం. పలాస ప్రజల దురద్రష్టం కొద్దీ ఉద్యమం రద్దయింది కాని లేకపోతే ఈపాటికే పలాస రాష్ట్రం వచ్చేసేది.. గిన్నీస్ రికార్డ్ ఎక్కేది. దేనికైనా అద్రష్టం ఉండాలిలెండి.

              నాకు అర్థం కాని విషయమేంటంటే రోశయ్య, సోనియా గాంధీల పరిస్థితి. ముందు నుయ్య వెనుక గొయ్య అన్నట్లుంది వీళ్ల స్థితి. తెలంగాణ ఇవ్వనంటే ఇక్కడ గొడవలు.. ఇస్తానంటే అక్కడ గొడవలు. నాకైతే నవ్వోస్తోంది. జాలి కూడా వేస్తోంది.

             ఇప్పుడు సరదాగా చెప్తున్నాను కానీ కొత్త రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్నవెంటనే మరో పది రాష్ట్రాల్లో ఉద్యమాలు ప్రారంభించారు అని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ దేశం ఇంకెన్ని ముక్కలు ఐపోతుందో అనిపించింది. ఉమ్మడి కుటుంబంలోని ఆనందాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అనిపించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ సమస్యల వలయంలోనే ఉన్నాయి అని తెలిసి కూడా కోరుకోవడం ఎందుకో అర్థం కావట్లేదు.

13.12.09

అమ్మబాబోయ్

అమ్మబాబోయ్ అనిపించింది. ఎప్పుడంటారా నా మొదటి టపా టైప్ చేస్తున్నప్పుడు.

            మొదటి టపాని బాగా రాయాలని బాగా ఆలోచించి ఒక నోట్స్ తీసుకుని అప్పుడు కొంత.. అప్పుడు కొంత లెక్క ఒక ఐదు.. ఆరు రోజులు రాసాను. అంతా చూసుకున్నాక ఇక టైప్ చేయొచ్చు అని నిర్ణయం తీసుకుని.. తూర్పుకి ఎదురుగా కూర్చుని (నిజమేనండి బాబు) పుస్తకాన్ని పక్కన పెట్టుకుని టైప్ చేయడం ప్రారంభించాను. తూర్పుకి ఎదురుగా ఐతే కూర్చున్నాను గాని దేవుడుకి దండం పెట్టలేదు.

           నాలుగు ఐదు లైన్లు ఉత్సాహంగా టైప్ చేసాను. అప్పటకి మెల్లగా సీన్ అర్థమౌతుంది. ఐనా మొదటి టపా కదా సరదా తగ్గలేదు. మరో నాలుగు లైన్లు టైప్ చేసేసరికి ఆ సరదా కూడా పోయింది. ఇంకా రెండు పేజీలకు పైగా ఉండేసరికి... మహేష్ బాబు కొట్టకుండానే నాకు మైండ్ బ్లాంక్ ఐంది. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. " దేవుడా.." అనుకుని టైప్ చేస్తున్నాను.

          అలా సాగుతుండగా ఒక దగ్గర "చేసేదే" బదులు "చెసేదే" అని టైప్ చేసాను. 'చె' తీసేద్దామని చూస్తే అది కాస్త "చసేదే" ఐంది. నా సహనం కూడా పోవడానికి సిద్ధంగా ఉంది. సరేలే అనుకుని 'చ' కి 'E' కలిపితే 'చే' అవుతుంది కదా అని టైప్ చేస్తే.. అది కాస్త "చఏసేదే" ఐంది. నా సహనమూ పోయింది. మళ్లీ 'చఏ' ని డిలీట్ చేసి 'చే' అని రాసేసరికి దేవుడు కనిపించాడు. ఆ సమయంలో పుస్తకాన్ని చూసేసరికి అదేమో కొండలా కనిపించింది. నాకు ముక్కోటి దేవతలు గిర్రున తిరిగి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు.

          ఆ విధంగా నేను తప్పు టైప్ చేసిన ప్రతీసారీ దేవుళ్లందరూ కలిసికట్టుగా ప్రత్యక్షమవడం ప్రారంభించారు.( ఎంత పుణ్యమో అనుకుంటున్నారా.. మీకే ఇస్తున్నా తీసుకోండి)

         ఆదివారం సమయం 1-40 దాటింది. ఓ పాడుబడ్డ మేడ దగ్గర సన్నని గోడ మీద ఓ కొంగ ఒంటి కాలు మీద నిల్చుని జపం చేస్తుంది.

          అది అక్కడ జపం చేస్తుంటే.. నేను ఇంట్లో నా టపాని టైప్ చేస్తున్నాను. కొన్ని తప్పులతో మరి కొంత సమయం విసుక్కుంటూ సగం పూర్తి చేసేసరికి.. " ఒరేయ్ భొజనానికి రా! " అంటూ మా అత్తయ్య పిలుపు.( వాళ్ల ఇంటిలోనే ఉన్నాను. రేపు వేరే రూమ్ కి వెళ్లిపోతున్నా!) " దేవుడా.." అని మరోసారి తలుచుకుని లేప్ టాప్ ని లాక్ చేసాను. ఈ ఆటంకాలేంటి అనుకుంటూ... " అసలు వీళ్లంతా ఎలా టైప్ చేసేస్తున్నారో.." అని బ్లాగులోకంలో బ్లాగులు రాస్తున్నవారందరిపైనా కుళ్లుకున్నాను( కోపమొస్తోందా... కానివ్వండి ).

        భోజనం చేసిన తరువాత కూడా దేవుళ్లను తలచుకుంటూ... బ్లాగుర్ల సహనాన్ని మెచ్చుకుంటూ(కాదు తిడుతూ ఏమో).. మిగతాదాన్ని టైప్ చేసి పోస్ట్ చేసాను. వెంటనే అనుకున్న మాట "హమ్మయ్య" అని.

        ఒక రోజు ఐనంతవరకూ ఒక్క కామెంట్ రాలేదు. దానితో నా కామెంట్ బాక్స్ పని చేస్తుందో లెదో అని సాయంత్రం నెట్ సెంటర్ కి వెళ్లి ఓపెన్ చేసి "just for cheking" అని టైప్ చేసాను. అది కనిపించింది. అప్పుడు చూసాను. అప్పటికే "పద్మార్పిత" గారు కామెంట్ చేసారు. నేను అదేం చూడకుండా కామెంట్ చేసినందుకు " ఛీ సరిగ్గా చూడొచ్చు కదా! గాబరెక్కువ " అని నాకు నేనే తిట్టుకున్నాను. ఆ తరువాత మిగతా వారి కామెంట్లు కూడా వచ్చాయి.

           ఇదంతా చదివాక నాపై "నేస్తం" గారి ప్రభావం ఉన్నట్టునిపిస్తుంది కదా! మీకు అనిపించినా అనిపించకపోయినా నాకు మాత్రం తెలుస్తోంది. ఆవిడ ప్రభావం నాపై ఉన్నట్లు.

           నేను కథలు వ్రాస్తాను( ఎప్పటికైనా రచయితగానే స్థిరపడాలనుకుంటున్నాను ). నా అభిమాన రచయిత "కొమ్మనాపల్లి గణపతి రావు గారు". ఆయన ఆర్థ్రత, కరుణ రసాలు బాగా వ్రాస్తారు. అవి నేను వ్రాయలేనులెండి.

          ఇంకా ఆయన ఒక పాత్ర ప్రవర్తనకు నాలుగు.. ఐదు.. కారణాలు వివరిస్తాడు. అందులో ఏదో ఒకటి అయుంటుందని చెప్తాడు. అలా ప్రతీ పాత్రకీ వివరిస్తాడు.

          అలా నేను ప్రయత్నించానులెండి. నా కథల్లో నేను కూడా ఓ రెండు కారణాలను వివరించగలిగాను. అదంతా ఆయన ప్రభావమే!ఇప్పుడు "నేస్తం" గారి ప్రభావం కూడా అదే స్థాయిలో ఉందనిపిస్తుంది.

         మరో విషయం ఏంటంటే నా పేరు నా బ్లాగు చిరునామాలో ఉంది. దాంతోనే పిలవండి... మీరు, గారు... అటువంటివేం వద్దు.

         ఇందాకల నుంచి కొంగ గురించి తెగ ఆలోచిస్తున్నట్లున్నారు. సమాధానం తెలిసిందా.. తలియలేదా.. పోనీలెండి నేనే చెప్పేస్తాను. చెప్పేస్తున్నా.. ఎందుకు నిల్చుందంటే.. దాని ఇష్టమండి. ఒంటి కాలుపై కాకపోతే ఒంటి వేలు మీద నిల్చుంటుంది. మీకెందుకు! అన్నా.. ఊరుకుంటుంటే అన్నీ అడిగేస్తున్నారే!

6.12.09

సవ్వడి

ఉదయాన్నే పువ్వుల సవ్వడి.. పగలంతా సూర్యుని సవ్వడి.. రాత్రి నక్షత్రాల సవ్వడి.. ఇవి ఆయా సమయాల్లోనే ఉత్తేజాన్ని అందిస్తాయి. అలా కాకుండా ప్రతీ క్షణం ఉత్తేజాన్ని ఇచ్చేది గుండె సవ్వడి. అందుకే దాని సవ్వడి ఎప్పుడూ అత్భుతమే!

ప్రతీ గుండె తనదైన సవ్వడి చేస్తుంది. ఆ మనసుకి మాత్రమే అర్థమయ్యే సవ్వడి. అందుకే " గుండె గుండెకో సవ్వడి " అంటారు.

ఈ గుండె సవ్వడిలో ఎన్నో ఆశలు.. ఎన్నో ఊసులు.. ఇంకెన్నో ఇష్టాలు.. అంతే స్థాయిలో కష్టాలు.. ఓటములు.. కన్నీరు.. ఇలా చాలా ఉంటాయి. కాబట్టే దాన్ని ఇష్టపడనివారు ఉండరు. రెండవవాటితోనే మొదటివాటికి విలువ. వీటిన్నింటినీ నిక్షిప్తం చేసేదే " గుండె సవ్వడి ".

స్పూర్తి :-

స్వాతి గారి " స్వాతి చినుకులు ", పరిమళ గారి " పరిమళం "... ఈ రెండు బ్లాగులు నాకు చాలా స్పూర్తినిచ్చాయి. బ్లాగు తయారుచేసుకుని అందులో టపా పెట్టినంతవరకూ నన్ను ఊరుకోనివ్వలేదు. వాళ్ల టపాలకన్నా వాళ్లు పెట్టుకున్న పేర్లే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చాయి. ఎంత చక్కగా పెట్టుకున్నారు అనిపించింది.
స్వాతి గారి బ్లాగు చిరునామా "ఊసులు". తన ఊసులకు "స్వాతి చినుకులు" అని ఎంత అందంగా పేరు పెట్టుకున్నారు. స్వాతి గారు పెట్టుకోవడం వల్లే ఈ పదానికి అంత అందం వచ్చింది. వేరేవాళ్లు ఎవరైనా ఈ పేరు పెట్టుకుంటే ఇంతగా నచ్చేది కాదేమో!

ఇక "పరిమళం" గురుంచి.. పరిమళ గారు తన కవితలతో పరిమళాన్ని వెదజల్లుతున్నారు అనిపించింది. " పరిమళం... " ఆ పేరే చాలు ఓ మంచి భావం కలుగుతుంది. ఆవిడ భావాలు కూడా అలాగే ఉన్నాయి.' గండు తుమ్మెదవు ' అంటూ తన స్వచ్ఛమైన ప్రేమను తెలియజేస్తూ మగవాళ్లని సున్నితంగా విమర్శించారు. ఆ కవిత చాలా నచ్చింది.ఇక ' వెతుకుతున్నా ఇంకా ' అనే కవిత చదివాక.. పొన్న చెట్టు నీడలో కృష్ణుడు కోసం ఎదురుచూస్తున్న రాధలా అనిపించారు. ఆ కవితలో చాలా లోతు ఉంది. ఇంకా ' అశ్రువు ', ' సూర్యుచంద్రులమా ', ' చెలీ ', ' మరునికుమారునివా ' అనే కవితలు పిచ్చిపిచ్చిగా నచ్చేసాయి.

               పేర్లులో ఏముంది అనుకుంటాం! కాని చాలా ఉంది అని ఇప్పుడే అర్థమైంది. కేవలం పేర్లే నాతో ఇప్పుడు ఇలా మాట్లాడనిస్తున్నాయి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. పేరులోని మహత్తు అర్థమయ్యాక నా బ్లాగుకి ఏ పేరు పెడదాం అని ఆలోచించాను. ఏదైనా మనసుకి హత్తుకునేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇలా అలోచించాక "సవ్వడి", "ఇష్టం" అనే రెండు పేర్లు తట్టాయి. రెండూ నచ్చాయి. వీటిలో సవ్వడే కొంచం ఎక్కువగా నచ్చింది, బాగుందనిపించింది. పెట్టేశాను.

              ఇక కేప్షన్ కింద " ఇది ఓ గుండె సవ్వడి " అని పెడదామనుకున్నా! అలా పెడితే కేవలం నాగురించే చెప్పాల్సివస్తుంది. కాని నాకు అందరి తెరుపున చెప్పడం ఇష్టం. మన గురుంచి మనం చెప్పుకోవడం రొటీన్. అందరి గురించి చెప్పడం వెరైటీ అనిపించి " గుండె గుండెకో సవ్వడి " అని పెట్టాను.
              ఇప్పుడు అర్థమైనదేంటంటే... అందరి గురించి చెప్పేది వారిపై మన అభిప్రాయమే కాని వారి ' గుండె సవ్వడి ' కాదని. పోనీలెండి పెట్టేశాం కదా! అలాగే ఉండనివ్వండి.

              చివరగా నా కోరికేంటంటే.. ఒక్కసారైనా ఈ బ్లాగుని స్వాతి గారు, పరిమళ గారు చూస్తే చాలు.
మళ్లీ కలుద్దాం...

బాయ్ !