20.12.09

మా మావయ్య ముఖ్యమంత్రి..



కొన్ని రోజుల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఏకైక చర్చ జరుగుతోంది. నిజానికి దేశం మొత్తం మీద ఇదే చర్చ జరుగుతోంది. అదేనండి మన రాష్ట్ర విభజన గురించి.. అప్పుడు జరిగిన సంఘటనను చెప్తున్నాను వినండి.

            ఎలాగో ఒకలాగ చిదంబరం గారు అర్థరాత్రి తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని సెలవిచ్చారు. తరువాత చాలా పరిణామాలు జరిగాయి. సీమాంధ్ర ఎమ్.ఎల్.ఎ.లు ఒకేరోజు వంద మంది దాక రాజీనామా చేసారు. ఇది ఒక ఎత్తు ఐతే.. మరో పది రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ప్రారంభమవడం ఒక ఎత్తు. వీటికి మించి మన రాష్ట్రంలోనే చాలామంది వివిధ రకాలుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం పెద్ద ఎత్తు.

           వాటిలో ఓ రెండు.. 1) రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులతో కలిసి తిరుపతి రాజధానిగా ఒక రాష్ట్రం కావాలట. 2) మరో పెద్ద మనిషి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూ.గో., ప.గో.లతో కలిసి విశాఖ రాజధానిగా ఒక రాష్ట్రం కావాలని అన్నాడట..! ఇంకో పెద్దమనిషి ఇంకో రకంగా కోరాడట! ఇలాంటి చాలా ప్రస్థావనలను టి.వి.లో చూసాక.. ఉన్న మతి కాస్త పోయింది.

             మా మావయ్య వచ్చిన వెంటనే ఈ విషయం చెప్పాను.(మా మావయ్య గురించి చాలా చెప్పాలి.. తరువాత చెప్తాను.) తను కూడా చాలా ఆశ్చర్యపోయారు. అప్పటికే సీమాంధ్రాల్లో సమైక్యంగా ఉండాలని ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. అది టి.వి.లో చూస్తున్నాం.

            ఆ సమయంలో మా మావయ్యకి తన స్నేహితుడు కిరణ్ గారు ఫోన్ చేసారు. ఆయనది గుంటూరు. మాదేమో పలాస( శ్రీకాకుళం జిల్లా ). ఇరు పక్షాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.

            మా మావయ్య సెల్ ఆన్ చేసి " అక్కడ అందరూ ఉద్యమాలు చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అబ్బాయ్." అన్నారు సరదాగా!

            "మరి నువ్వేంటో" అన్నారు కిరణ్ గారు.

            "నేను పక్కా తెలంగాణ వాదిని... తెలంగాణియన్" అన్నారు ఒక కొత్త పదాన్ని ఉపయోగిస్తూ. అతను ఏమన్నారో తెలీదు కాని మా మావయ్య మంచి డైలాగ్ వేసారు. " అది కాదు కిరణ్.. నేను కూడా దీక్ష చేస్తాను గ్రేటర్ పలాస ఇస్తారా!" అన్నారు.( పలాస చిన్న మున్సిపాలిటి మాత్రమే) .

            "గ్రేటర్ పలాసా... " అని వెటకారంగా అన్నట్లున్నారు.

             "ఓ.కె.. ఓ.కె.. ప్రత్యేక పలాస ఇస్తారా!" అన్నారు.

             ఇంతలో మా బావ "ఆయన ప్రత్యేక గుంటూరు అడుగుతారు" అన్నాడు.(మా బావ పెద్ద మావయ్య కొడుకు. తను ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు చెప్తుంది చిన్న మావయ్య గురించి.. నాకు మ్పొత్తం నలుగురు మావయ్యలు).

             ఆ తరువాత మేము భోజనాలకి వెళ్లడం వల్ల ప్రత్యేక పలాస ఉద్యమాన్ని రద్దు చేసాం. లేకపోతే ఈపాటికే పలాస రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా మావయ్య.. ఉప ముఖ్యమంత్రిగా నేను.. ఇలా అన్ని పదవుల్లొనా మా కుటుంబం వాళ్లమే ఉండి చక్కని కుటుంబ పాలన సాగిస్తుండేవాళ్లం. పలాస ప్రజల దురద్రష్టం కొద్దీ ఉద్యమం రద్దయింది కాని లేకపోతే ఈపాటికే పలాస రాష్ట్రం వచ్చేసేది.. గిన్నీస్ రికార్డ్ ఎక్కేది. దేనికైనా అద్రష్టం ఉండాలిలెండి.

              నాకు అర్థం కాని విషయమేంటంటే రోశయ్య, సోనియా గాంధీల పరిస్థితి. ముందు నుయ్య వెనుక గొయ్య అన్నట్లుంది వీళ్ల స్థితి. తెలంగాణ ఇవ్వనంటే ఇక్కడ గొడవలు.. ఇస్తానంటే అక్కడ గొడవలు. నాకైతే నవ్వోస్తోంది. జాలి కూడా వేస్తోంది.

             ఇప్పుడు సరదాగా చెప్తున్నాను కానీ కొత్త రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్నవెంటనే మరో పది రాష్ట్రాల్లో ఉద్యమాలు ప్రారంభించారు అని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ దేశం ఇంకెన్ని ముక్కలు ఐపోతుందో అనిపించింది. ఉమ్మడి కుటుంబంలోని ఆనందాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అనిపించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ సమస్యల వలయంలోనే ఉన్నాయి అని తెలిసి కూడా కోరుకోవడం ఎందుకో అర్థం కావట్లేదు.

7 comments:

శరత్ కాలమ్ said...

జై పలాస!

Nrahamthulla said...

రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

సంతోష్ said...

naaku
greater pathapatnam kavaloch..
jai pathapatnam
jai palasa
jai srikakulam
jai telangaana

పరిమళం said...

మీరు చదివారో లేదో ఈ న్యూస్ ....తెలంగాణా ..ఆంధ్రా తేడాలేకుండా ..ఆదివాసీలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలంట ! మరి వీరిమాటేవిటి?శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలట! వీల్లేదని 38 లక్షల మంది మనోభావాల్ని అర్ధం చేసుకోకుండా తోసిపుచ్చుతారా ?వారికి జరిగిన అన్యాయానికి వారూ ఓ మూడువేలమందైనా ఆత్మాహుతికి సిద్ధపడి పోరాటం చేస్తే .......

సవ్వడి said...

శరత్ గారు ధన్యవాదాలు.

nrahamthulla గారు మీకు చాలా విషయాలు తెలుసు. యానాం గురించి నాకు ఇంతవరకూ తెలీదు. మన రాజకీయ నయకులు ఇటువంటి విషయాలు ఎందుకు పట్టించుకోరో నాకు అర్థం కాదు. వీళ్లని ఏం చేసినా తప్పు లేదులెండి.

సంతోష్ గారు అన్నీ తెచ్చేసుకుందామంటారా.. సరే మీ ఇష్టం.

పరిమళ గారు మీరు చెప్పిన విషయం నాకు తెలీదు. అసలు ఏం జరగబోతుందో...

పరిమళం said...

ఇది నిజంగానే లోకల్ ఎడిషన్లో వచ్చింది .కాని వీరివెనుక పెద్ద నాయకులెవరూ లేరనుకుంటా బహుశా ! అందుకే ఎవరూ పట్టించుకోలేదు .

శివ చెరువు said...

మాది భద్రాచలం. నేనూ ప్రత్యేక భద్రాచలం అడగొచ్చా. వీజీ గా ముఖ్య మంత్రి అవ్వొచ్చు... హి హి హి...