31.7.10

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవిందగోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద


మహిమల మఱ్ఱాకు తెప్పపై తేలేటి.. గోవిందా హరి గోవింద

ఏడేడు లోకాల నేలేటి కోనేటి.. గోవిందా సిరి గోవింద

వైఖుంఠమే వదిలి వచ్చావు వరహాల.. గోవిందా హరి గోవింద

పుట్టలోన దాగి పాలు తాగిన పుడమి.. గోవిందా సిరి గోవింద

వకుల పర్ణశాల వర్ణాల వర్ధిల్లు.. గోవిందా హరి గోవింద

అలమేలు మంగమ్మ అందాల గంధాల.. గోవిందా సిరి గోవింద

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద " 2 "

నింగి నేల కలిసి సిరుల నిత్య కల్యాణాల.. గోవిందా హరి గోవింద

ఆనంద నిలయాన ఆనందమందించు.. గోవిందా సిరి గోవింద

గోవిందా........ గోవింద.

అడగడుగు దండాల అల వడ్డి కాసుల.. గోవిందా హరి గోవింద

ఆపద మొక్కుల అందరిని దరిచేర్చు.. గోవిందా సిరి గోవింద

వేంకటేశా........... శ్రీ వేంకటేశా నీవంటి దైవం లేదు.. గోవిందా హరి గోవింద

బ్రహ్మాండమంతటా వేంకటాద్రి వెలుగు.. గోవిందా సిరి గోవింద

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద

ఝుమ్మంది నాదం చిత్రంలోని ఓ మంచి పాట. దీనితో పాటు పెళ్లి పాట, లాలి పాట, సంక్రాంతి పాట కూడా నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలు వచ్చాయి కాని నేను ఇంకా ఇవే వింటున్నాను.

ఈ పాట నాకు బాగా నచ్చిన పాట. చిన్న చిన్న పదాలతో ఎంత అందంగా ఉంది కదా! శ్రీనివాసుడిని స్మరించుకోవడమే ఒక అందమైన అనుభవం. అటువంటిది ఇంత చక్కని పాటను మన మధుర గాయకుడు " బాలు " గారు పాడాక చెప్పేదేముంటుంది!

కొన్ని రోజుల క్రితం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. రోడ్ మీద నిల్చొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను.

నిజానికి ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా అని చూస్తుంటాను. పుస్తకాలు చదువుకోవచ్చని... కాని రూమ్ కి వెళ్లాలనిపించట్లేదు. అక్కడ చదవవలసిన చాలా ఉన్నాయి. కోతి కొమ్మచ్చి, " కొమ్మనాపల్లి " పడిలేచే కడలి తరంగం, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఒకటి ఉంది(ఈ పుస్తకం లైబ్రెరీ నుండి తెచ్చుకున్నది). ఇంకా రామాయణం కూడా చదువుతున్నాను. బాలకాండ చదివేసాను. ఇంకా ఆరు కాండాలు ఉన్నాయి.

అలాగని గ్రంధాలయం కి వెళ్లాలని అనిపించట్లేదు. అక్కడ కొమ్మనాపల్లి రచనలు లేవు. మిగతావారివి నాకు పెద్దగా ఎక్కవు. ఏం చేద్దాం అనుకుంటుంటే కనిపించిందో ఓ పెద్ద బస్సు. డాన్స్ చెయ్యాలనిపించింది. కాని చూసినవాళ్లకి పిచ్చి ఎక్కుతుతందని.... వాళ్లకోసం రిస్క్ తీసుకోలేదు. కనిపించిన బస్సు ఏదంటే... విశాలాంధ్ర వారి " సంచార పుస్తకాలయం ". వెంటనే దూరిపోయాను.

నేను ఏ బుక్ షాప్ కి వెళ్లినా మొదట చూసేది నవలలు, తరువాత వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఆ తరువాత మిగతావన్ని ఓ రౌండేసి చూస్తాను. ఇప్పుడు అలాగే వెళ్లాను. వికాస పుస్తకాల దగ్గర ఆగిపోయాను. ఓ రెండు మూడు కొనేయాలనిపించింది. పర్స్ తీసి చూస్తే రూ. 70/- ఉన్నాయి. చాలా ఎక్కువ కదా! వెంటనే " రేపు ఉంటుందా.. " అని వాడిని అడిగాను. " ఊ.. " అన్నాడు. మరి ATM కి వెళ్లకుండా ఆ 70/- లోనే 30/- తో " ఎంకి పాటలు " కొన్నాను. మనం కొనకుండానా... చెప్పండి.

తరువాత రోజు వెళ్లి " The Man Who Sold His Ferrari " తెలుగు అనువాదం కొన్నాను. ఇంకా " నాహం కర్తా, హరిః కర్తా " కొనేసాను. కేవలం రెండు అనుభవాల కోసమే కొన్నాను. అప్పుడు స్వాతి లో " సర్వ సంభవాం " పేరిట వచ్చినప్పుడు మొత్తం చదివాను. ఐనా కొన్నాను. చిత్రమైన విషయమేంటంటే... ఆ ముందురోజే మా అమ్మ, నాన్న స్వామి వారికి సేవ చెయ్యడానికి తిరుమల వెళ్లారు. వారం అక్కడే ఉంటారు. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే వాళ్లు అక్కడ ఉన్నప్పుడే చదివేయాలనుకున్నాను... చదివేసాను.


గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద.....

ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఒళ్లు పులకిస్తూనే ఉంది. కొన్ని చోట్ల కంట తడి పెట్టుకున్నాను. కొన్నిసార్లు విపరీతమైన ఆశ్చర్యం... మరి కొన్నిసార్లు ఏదో తన్మయత్వం. ఇంకా ఆ పుస్తక రచయిత లాగా మనం కూడా స్వామికి దగ్గర ఐపోతే ఎంత బావుణ్ణో అనిపించింది.

నేను కేవలం " పాలాభిషేకం ", " కాసుల హారం " ఈ రెండింటికోసమే కొన్నాను. పాలాభిషేకం మొదట చదవాలనుకున్నాను. కాని అది " నేరస్థుడెవరు " అన్న పేరుతో ఉండడం వల్ల అన్నీ తిరగేసి... అది దొరకక మళ్లీ మొదటి నుండి చదివాను. నిజానికి పాలాభిషేకానికి ఎక్కువ స్పందించి కాసుల హారం కి తక్కువ స్పందిస్తాను అని అనుకున్నాను. కాని దానికి విరుద్ధంగా జరిగింది. కాసుల హారం చదువుతున్నంతసేపు నా కళ్లు తడి అవుతూనే ఉన్నాయి. మధ్యలో రెండు పేజీలు మసకగానే చదివాను. ఇంచుమించుగా ఓ ఏడు ఎనిమిదిదిసార్లు నా కళ్లు తుడుచుకుని ఉంటాను. అది పూర్తయ్యేసరికి ముక్కు నుండి చక్కగా కారుతుంది.

కాసుల హారం గురించి క్లుప్తంగా... కేరళలోని ఓ నిరుపేద భక్తుడికి స్వామి వారు కలలోకి వచ్చి " నాకొక కాసుల హారం చేయించరా.. " అని అడుగుతాడు. అతను చూద్దాంలే అని అనుకుంటాడు. తరువాత రోజు మళ్లీ కలలోకి వస్తే... ఇంట్లోవాళ్లతో చర్చించి ఓ రాగి కాసుల హారం చేయిద్దాం అనుకుంటారు. కాని స్వామివారు మళ్లీ కలలోకి వచ్చి బంగారం ది కావాలంటారు. అప్పటినుంచి ఇంట్లో ఉన్నవారందరూ పిల్లలతో సహా మొత్తం ఇరవైమంది రోజుకు ఒకపూట తిని ఒకపూట పస్తు ఉండి, అందరూ ఏవో పనులు చేస్తుంటే... ఆరు నెలలకు రెండు కాసులు చేయించగలుగుతారు. ఇంకా 106 చేయించాలి. నేను " సర్వేశ్వరా... " అనుకున్నాను. క్షణంలోనే నవ్వు వచ్చింది. వేంకటరమణ మూర్తి గురించి చదువుతూ ఈశ్వరుడుని తలచుకోవడం... అంతలోనే " ఇద్దరికీ బేధం లేదు కదా! " అనుకున్నాను.మహిమల మఱ్ఱాకు తెప్పపై తేలేటి.. గోవిందా హరి గోవింద.

ఏడేడు లోకాల నేలేటి కోనేటి.. గోవిందా సిరి గోవింద....తరువాత వాళ్ల పరిస్థితి కాస్త మెరుగుపడి... మొత్తానికి 16 సంవత్సరాలకి పూర్తిగా కాసుల హారం చేయించగలుగుతారు. అప్పుడు శ్రీవారు మళ్లీ కలలోకి వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి " హారంతో నన్ను చూసుకోండి. " అని చెప్పారు. అంతే కాకుండా పలానా వ్యక్తిని కలిస్తే మీ పని అవుతుందని కలలోనే ఒకరిని చూపించారు. వీళ్లంతా తిరుమల చేరుకుని ప్రసాద్ గారికి మాట్లాడుతుండగా.. ఆ భక్తుడికి కలలో కనిపించిన వ్యక్తి గుర్తొచ్చి... ప్రసాద్ గారి చెయ్యి పట్టుకుని ఊపేస్తూ " మీరే మీరే... స్వామివారు మిమ్మల్నే చూపించారు " ఆనందంతో చెప్తుంటే ప్రసాద్ గారి కళ్లవెంట ఆనంద భాష్పాలు! ఎంత అదృష్టం కదండి. తరువాత ప్రసాద్ గారే అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు కూడా నాకళ్లు చెమ్మగిల్లాయి.

]

వైఖుంఠమే వదిలి వచ్చావు వరహాల.. గోవిందా హరి గోవింద


పుట్టలోన దాగి పాలు తాగిన పుడమి.. గోవిందా సిరి గోవింద....పాలాభిషేకం గురించి క్లుప్తంగా... ప్రతి శుక్రవారం స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది. ఆరోజు కూడా ప్రసాద్ గారు, ఆయన భార్య గోపిక గారు, మరికొంత మంది భక్తులు కూర్చొన్నారు. అభిషేకం ప్రారంభించకుండా అర్చకులు, ఆలయ సిబ్బంది అటూ ఇటూ తిరుగుతూ గంగాళాలు మారుస్తున్నారు. ప్రసాద్ గారు అడిగినా విషయం మాత్రం చెప్పలేదు. మొత్తం అభిషేకం పూర్తి ఐయ్యాక బైటకువచ్చి ప్రసాద్ గారు అడిగారు. స్వామివారికి తెచ్చిన పాలు విరిగిపోయాయండి అని చెప్పారు. వెంటనే డైరీకి ఫోన్ చేసి మళ్లీ తెప్పించాం. అవి కూడా విరిగిపోయాయి. అన్నారు. "డైరీలో బాగానే ఉన్నాయి. ఆలయంలోకి వచ్చేసరికి విరిగిపోయాయి" అని చెప్పారు. అలాగే భక్తులు తెచ్చినవి కూడా ఆలయంలోకి తీసుకురాగానే విరిగిపోయాయి అని చెప్పారు. ప్రసాద్ గారికి కోపం వచ్చి డైరీ వాడిని డిస్మిస్ చేసేసారు. అప్పుడు అక్కడకి గోపిక గారు ఏడుస్తూ వచ్చారు. "స్వామి అభిషేకానికని కొన్న పాలు ఇంట్లోనే మరచిపోయానండి." అంటూ కన్నీరు కారుస్తున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది " మీరు అభిషేకానికే కొన్నారా... మీ పాలతోనే అభిషేకం చేసామండి " అని చెప్పారు. అంతే విషయం అర్థమైపోయింది. ఆవిడ ఆనందంగా శ్రీవారిని దర్శించుకోవడానికి పరుగెడుతూ వెళ్లిపోయారు. అసలు విషయం ఏంటంటే వీళ్లు పాలాభిషేకం చేయించాలని ఎప్పుడో మొక్కుకున్నారు. కాని రోజూ మరచిపోతున్నారు. అందుకే స్వామివారే పాలను తెప్పించుకున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే.... ఒకే డైరీ నుండి వచ్చిన పాలు వీళ్లవి కాకుండా మిగతావన్ని ఎందుకు విరిగిపోయాయి. దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు.

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద.....మా అమ్మ, నాన్న ఇంకా తిరుమలలోనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం శ్రీవారి దర్శనం చేసుకుని సాయంత్రం ఎనిమిది గంటల ట్రైన్ కి బయలుదేరుతున్నారు. వాళ్లు తిరుమలలో ఉండగానే పోస్ట్ కూడా పెట్టాలనుకున్నాను. పెట్టేసాను. గత నెలరోజులుగా ఏ పోస్ట్ పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. చిత్రం... నిన్న ప్రారంభించి ఈరోజు పోస్ట్ పెట్టేసాను. ఎలా సాధ్యమైంది... అందుకే " నాహం కర్తా, హరిః కర్తా " అన్నారు. నా అభిప్రాయం అదే!

వకుల పర్ణశాల వర్ణాల వర్ధిల్లు.. గోవిందా హరి గోవింద


అలమేలు మంగమ్మ అందాల గంధాల.. గోవిందా సిరి గోవింద

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద

6 comments:

శ్రీలలిత said...

అద్వితీయమైన అనుభవాలు. చదువుతుంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి.

సవ్వడి said...

శ్రీ లలిత గారు! మీకు నా బ్లాగుకి స్వాగతం.
నేను రాసినవే కాదు.. అందుకో ఉన్న చాలా అనుభవాలకి కన్నీరు వస్తాయి.

sireesha said...

naku eppudu bhakti bhaavam kalagaledu. kaani tirumala velte oka rakamaina santhosham, prasaantata anipistundi. kani meeru mee parents tirumala vellina kooda meeru ikkada nunDea aa bhaavam pondutunnarante nammalekapotunnanu. nice narration.

మనసు పలికే said...

చాలా బాగుంది సవ్వడి గారు.. చదువుతున్నంత సేపూ ఆ దేవదేవుడి మీద భక్తి పొంగుకొచ్చింది..:)
చాలా చాలా బాగుంది.

నేస్తం said...

పోస్ట్ ఎప్పుడో చదివాను..కామెంట్ రాద్దామనుకుని బద్దకించేసా..స్వామి వారు మా ఇంటి ఇలవేలుపు..నాన్నకు ఎంతో ప్రీతికరమైన దేవుడు ..ఇటువంటి అనుభవాలు వారికి ఎన్నో ఉన్నాయి ..అసలుపోటోస్ చూస్తేనే వళ్ళు పులకరిస్తుంది..నాకెందుకో తిరుపతి గుర్తువచ్చింది ..మంచి పోస్ట్

మధురవాణి said...

నమో వేంకటేశా! ఈసారి ఆధ్యాత్మికత నింపిన పోస్ట్ రాశారన్నమాట! :)