26.8.10

స్వీట్ రిలేషన్

ఆగస్ట్ 17 న మా అక్క( పెద్దనాన్న కూతురు ) శ్రీదేవి పుట్టిన రోజు. ఆ రోజు మరచిపోయాను. రేపు చెయ్యాలని అంతకు ముందురోజే చక్కగా అనుకుని యథావిధిగా మరచిపోయాను. తరువాత రోజు కాల్ చేసి " నిన్న నీ పుట్టినరోజు అనుకుంటాను. " అన్నాను.


" ఆ ! నువు చేస్తే నాలుగు దులుపేద్దాం అనుకున్నాను. " అని " ఎందుకు చెయ్యలేదు. " తిరిగి అడిగింది.

" గుర్తు రాలేదే! మొన్న సాయంత్రం అనుకున్నాను... నీకు చెయ్యాలని. కాని మరచిపోయాను. "

తను తిట్టడం మరచిపోయి " పోనీలే ఈరోజైనా చేసావు. " అని ఊరుకుంది.

" బర్త్ డే ఎలా జరిగింది " అడిగాను.

" రేపు చెయ్యు నాన! చెప్తాను. ఇంట్లో చుట్టాలున్నారు. "

నాకు విషయం అర్థమై " సరే సరే! రేపు చేస్తాను. " అన్నాను. సీక్రెట్స్ ఏమైనా చెప్పాల్సి వస్తే ఎవరూ లేనప్పుడు చెప్తుందనమాట. దానికి అర్థమై నవ్వింది. " ఎప్పుడు చెయ్యాలి " అన్నాను.

" 11-30 టైమ్ లో చెయ్యు "

" సరే " అని పెట్టేసాను.

మాకు అక్కాచెల్లెళ్ళు లేరు. వాళ్లకి( మా పెద్దనాన్న కు ఇద్దరు అమ్మాయిలు ) అన్నదమ్ములు లేరు. ఆవిధంగా మేము చిన్నప్పటినుండి సన్నిహితంగా ఉండేవాళ్లం. మా చిన్న అక్క కన్నా ఈ అక్కతో నేణు ఇంకా ఎక్కువ క్లోజ్ దీనితో మాట్లాడుతున్న ప్రతీసారీ.... నాకు ఒక అక్క ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.

పేరుకి అక్క గాని నాకు ప్రెండే! మా మాటలు ఎప్పుడూ తిన్నగా ఉండవు. నోటికి ఏం వస్తే అవే వాగేస్తాం. మీకో ఇంకో సంగతి చెప్పనా... తనది ప్రేమ వివాహం. ఆ కథంతా నాకు చెప్పింది. నేను టెంత్ సెలవులకు వెళ్లినప్పుడు చెప్పింది. ఆ కథని మీకు తరువాత చెప్తాను( నాకు ఓపిక ఉంటే ). ప్రేమను పెళ్లి వరకూ తీసుకురావడానికి చాలా కష్టపడాలి. కాని మా అక్క పది శాతం కూడా కష్టపడలేదు. అంత సులభంగా పెళ్లి జరిగింది. దీనికి ముఖ్యంగా రెండు కారణలను చెప్పుకోవాలి. ఒకటి... అబ్బాయి వాళ్లు మా కేస్టే! ఇక్కడే అరవై శాతం సమస్య తీరిపోయింది. మిగతా నలఫై శాతం ఐనా కష్టపడాలి కదా! ఊహు... లేదు. దీనికి కలిసొచ్చిన మరో అంశం... మా అక్క వాళ్ల తాతగారు( అమ్మవాళ్ల నాన్న ) " అందవరపు " వాళ్లు. సదరు మా బావగారు రఘు కూడా " అందవరపు " వాళ్లే! మా బావగారు మా అక్కవాళ్ల మావయ్యతో మాట్లాడి మా పెద్దనాన్నను ఒప్పించారు. అలా సులభంగా జరిగిపోయింది.

మా అక్క ఐతే ఇప్పటకీ " మాది లవ్ మేరేజ్ కాదు. ఎరేంజెడ్ మేరేజ్ " అని వాదిస్తుంటుంది. నేను కూడా అలాగే వాదిస్తుంటాను... " లవ్ మేరేజే అని ". నా జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న జంటని వీళ్లనే చూసాను. ఇప్పటివరకూ ఇంకెవరినీ చూడలేదు. మొన్ననే వేసవి కాలంలో డార్జీలింగ్, కచ్... అక్కడ దగ్గరలో ఉన్నవన్నీ స్నేహితులతో కలిసి కుటుంబ సమేతంగా చూసి వచ్చారు.

ఈ అక్క నాతో ఇంత క్లోజా... ఐనా దీని పెళ్లికి వెళ్లలేదు. ఎందుకంటే మేము ఇల్లు కట్టుకుని దిగినప్పుడు వీళ్లు రాలేదు. కారణాలు ఇక్కడ అనవసరం. మా నాన్నగారు మాత్రం చాలా బాధపడ్డారు. తరువాత మా ఇంటికి వచ్చారు ఐనా నాకు కోపం తగ్గక దీని పెళ్లికి వెళ్లలేదు. కొన్ని రోజుల తరువాత అన్నీ మామూలే!

మరో విచిత్రమైన సంగతేంటంటే.... నేను ఎమ్.బి.ఎ చేస్తున్న సమయంలో పెద్దగా దీనితో మాట్లాడలేదు. ఇంచుమించుగా సంవత్సరంకు పైగా మాట్లాడిన సంధర్భం లేదు. ఆ తరువాత పండుగ కి నేను వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు... " ఇదిగోరా నా కూతురు ! " అంటూ చంకలో ఉన్న పాపని చూపించింది. నాకా సంగతే గుర్తు లేదు. " దీనికో పాప పుట్టింది కదా! " అని అప్పుడు గుర్తొచ్చింది. ఆ టైమ్ లో ఇంటికెళ్లడమే ఐయ్యేది కాదు. ఇంటికెళ్లినా అందరి గురించి మాట్లాడడం చాలా తక్కువ. పాప పుట్టిన సంగతే గుర్తు లేదు, ఇంకా పాప పేరు నాకెలా తెలుస్తుంది. " పేరేంటే ! " అని అడిగాను. " గాయత్రి " అని చెప్పి తిట్టింది. మనం ఒక చెవి నుండి వినేసి ఇంకో చెవి నుండి వదిలేసాం.

ఇప్పుడుఅసలు విషయానికి వద్దాం. ఆ తరువాత రోజు 11-30 కి కాల్ చేసాను. తనే ఎత్తింది.

" హాయ్ డార్లింగ్! " అని పలకరించాను.

" హాయ్ ! " అంది.

" ఇప్పుడు చెప్పు ఎలా జరిగిందో ! "

" బావ, నేను గుడికి వెళ్దామని బయలుదేరాం. నాకు గిప్ట్ కొనడానికని జ్యుయెలరి షాప్ కి తీసుకెళ్లారు. అక్కడ ఇయర్ రింగ్స్, రింగ్ తెసుకున్నారు. "

" ఊ.... "

" పాపకి ఒంట్లో బాలేదు. హాస్పిటల్ కి తీసుకెళ్లాం. నాకు కూడా బాలేదు పన్ను నొప్పి. మరో డాక్టర్ దగ్గరకి వెళ్లాం. అప్పటికే గంటన్నర దాటింది. మరి గుడికెళ్లకుండా ఇంటికొచ్చేసాం. సాయంత్రం నేనొక్కదాన్నే గుడికి వెళ్లొచ్చేసాను. " అని ముగించింది.

" ఓస్ దీనికేనా! నేను ఇంకా పెద్ద రొమాన్స్ జరిగిపోయిందనుకున్నాను కదే! " వెంటనే అన్నాను.

దానికి కొంచెం నవ్వి " అంటే మరొకటి జరిగిందిరా.. బావ అర్థరాత్రి పన్నెండుకే విష్ చేసి సెల్ పోన్ గిప్ట్ ఇచ్చారు. " నేను ఇంకా సెల్ గురించి అడుగుదామనుకునేలోపలే " నేను దాన్ని తిరిగి ఇచ్చేసాను. " అంది.

" ఏం ! సెల్ నచ్చదా! "

" దాన్ని చూడగానే భయమేసిందిరా! ఇచ్చేసాను." అంది అమాయకంగా.

" భయమెందుకే ! "

" అది కాదు నాన! నామీద దీవేస్తే నువ్వు పోన్ చేస్తావు. అలాగే అందరూ చేస్తారు. ఇప్పుడైతే బావతో మాట్లాడి నాతో మాట్లాడుతున్నారు. అదే నాకు సెల్ ఉంటే అన్నీ నాకే చెప్తారు. అందరూ నాతోనే మాట్లాడతారు. నాకే బావతో చెప్పేయమటారు. నాకు అలా నచ్చదు. నాకు చేసినవాళ్లు బావతో కూడా మాట్లాడాలి. బావతో చెప్పాకే నాకు చెప్పాలి. అలా ఐతే నాకిష్టం. " అంది. దానితో ఏం అనలేదు కాని మనసులో మెచ్చుకున్నాను.

" మరి నువ్వేం చేస్తావు బావ బర్త్ డేకి. " అని అడిగాను.

" నేనేం చేస్తాను ఓ షర్ట్ కొంటాను. అంతే! " అని " ఏం చెయ్యాలో నువ్వు చెప్పు " అంది.

" మగవాళ్లకి ఏముంటాయ్..... " ఇంకా చెప్తుండగానే

" డి.ఎమ్. ఇచ్చాను. అది ఎప్పుడు ఉంటుందనుకో ! "అంది.

" డి.ఎమ్ " అంటే...

" డెయిరీ మిల్క్ "

" ఇంకేం డి.ఎమ్. ఇచ్చేసి ఐ లవ్ యు చెప్పేయడమే! సోరీ డి.ఎమ్. ఇచ్చేసి హేపీ బర్త్ డే చెప్పేయడమే ! "

తను నవ్వేసి " డి.ఎమ్. ఎప్పుడూ ఉంటుందిరా. ఒకసారి మాత్రం ఫైవ్ స్టార్ కొన్నాను. ఆరోజు బావకు, నాకు తగువు ఐంది. అప్పటినుండి నేను గాని బావ గాని ఫైవ్ స్టార్ ని ఒక్కసారి కూడా కొనలేదు. "

" నాకా డి.ఎమ్. నచ్చదు. "

" హే.... ఏంటిరా ! "

" ఔనే నాకస్సలు నచ్చదు. " అన్నాను.

" నీకు నాకు పడనిది ఇదొక్కటే అన్నమాట. "

" ఆ..."

" బావకి నాకు పడింది ఇదొక్కటే ! " అని సరదాగా అంది.

" సరే! ఈసారి పోన్ చెయ్యు " అన్నాను కాల్ కట్ చేసేముందు.

" పోరా... " అంది అవసరం లేనట్లుగా!

" రాక్షసి " అన్నాను కోపంగా! వెంటనే " సరే బాయ్! " అన్నాను.

తను " బాయ్ " అంది. నేను పెట్టేసాను.



బావగారిపై తన అభిమానం స్వీట్ కదా!

23 comments:

శిరీష said...

okkosari own akkalakanTea ilaa cousins close ga vuntaru, akka tammudu, chelli anna andaru snehitulla vundatam luck.

mee post bagundi.

గీతిక said...

yes. so sweet relation...!
nice post.

సవ్వడి said...

నిజమే శిరీష గారు! నాకు నిజంగా అక్క ఉంటే ఇంత క్లోజ్ గా ఉండేవాడినా అని సందేహం వచ్చేది. ఇలాగే బాగుంది. పోస్ట్ నచ్చినందుకు థాంక్స్.
గీతిక గారు! ఖచ్చితంగా వాళ్లది స్వీట్ రిలేషనే! మీకు పోస్ట్ నచినందుకు ధన్యవాదాలు.

భాను said...

మీ పోస్ట్ బాగుంది. నిజమే రిలేషన్స్ ఇయా ఉంటె ఎంత బాగుంటాయి

కృష్ణప్రియ said...

హ్మ్మ్,, బాగుంది.

కృష్ణప్రియ

సవ్వడి said...

భాను గారు! ధన్యవాదాలు.
రిలేషన్స్ ఇలా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉందనుకుంటాను.


కృష్ణ ప్రియ గారు! నచ్చినందుకు ధన్యవాదాలు.

నేను said...

baavundi mee post.

btw,
మా మాటలు ఎప్పుడూ "తిన్నగా" ఉండవు//
నామీద "దీవేస్తే" నువ్వు పోన్ చేస్తావు//
naaku nacchina vaakyalu. chaalarojulaindi avi vini :-)

సుజాత వేల్పూరి said...

బావుంది మీ అనుబంధం! నాకూ నా సొంత అన్నయ్యతోలేని అనుబంధం పెదనాన్నగారి కొడుకుతో ఉంది. వాడంటే నాకు చాలా ఇష్టం! వాడితోనే చనువెక్కువ! మీ టపా చదువుతుంటే వాడు గుర్తొచ్చాడు. థాంక్యూ

సవ్వడి said...

బద్రి గారు! ధన్యవాదాలు.
" తిన్నగా ", " దీవేస్తే " విని చాలా రోజులైందా! మా అక్క " దీవేస్తే " అన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. " ఈ మాట విని ఎన్ని రోజులైందో " అనిపించింది.
మీ బ్లాగు చూడాలంటే ఏం చెయ్యాలండి... కాస్త చెప్తారా!

సుజాత గారు! ఎన్ని రోజులైందండి కనిపించి.
అప్పుడెప్పుడో మా బంగారుతల్లి గురించి రాసినప్పుడు కనిపించారు. మళ్లీ ఇప్పుడు కనిపించారు.
మీకు మీ అన్నయ్య గుర్తొచ్చారా....! నచ్చినందుకు ధన్యవాదాలు.

కృష్ణప్రియ said...

" దీవేస్తే " అంటే ఏంటి? నేనిదే మొదటి సారి వినటం.. ముందరే అడుగుదామనుకున్నాను. కానీ.. తెలుసుకుందాం లే మనమే అని ఆగిపోయాను.

హరే కృష్ణ said...

బాగా రాసారండీ
template బావుంది

సవ్వడి said...

కృష్ణ ప్రియ గారు! " దీవి " అంటే.... మనం ఎవరినైనా ఎక్కువ రోజులు చూడకుండా ఉంటే చూడాలనిపిస్తుంది కదా! అదేవిధంగా మాట్లాడకపోతే మాట్లాడాలనిపిస్తుంది. ఆ భావాన్ని " దీవి " అంటాం. మామూలుగా మాట్లాడేటప్పుడు " నీమీద దీవేసింది " అంటాం.


హరే కృష్ణ గారు! టపా నచ్చినందుకు థాంక్స్. టెంప్లేట్ నచ్చినందుకు ధన్యవాదాలు.

శేఖర్ పెద్దగోపు said...

బాగుంది మీ అక్క,తమ్ముళ్ళ అనుభందం..అలాగే అక్క,బావల రిలేషన్ కూడా...

నేస్తం said...

" దీవేస్తే " నాకు మొదట్లో అర్ధం కాలేదు :) నేను మాత్రం మా తమ్ముళతో ఎప్పుడు మాట్లాడినా మా ఆయన మీద చాడీలు తప్ప ఒక్కసారి కూడా పొగిడిన పాపాన పోలేదు... దాంతో వాళ్ళే ఆ బాధ్యత తీసుకుని నన్నే నాలుగు మాటలు అంటారు :)

మనసు పలికే said...

సవ్వడి గారు, చాలా బాగుందండీ మీ టపా..

సవ్వడి said...

శేఖర్ గారు! మీకు రెండు ధన్యవాదాలు.

నేస్తం గారు! మీరు కామెంట్లలో కూడా నవ్వించేస్తారు.
మీవారిని మాత్రం ఎక్కడా వదలరు.. పాపం.
మీకు కూడా ధన్యవాదాలు.

మనసు పలికే! థాంక్యు.....

కొత్త పాళీ said...

మీ బంధుత్వాలు బాగున్నాయి. ఒక్కోసారి నిజం సోదరీసోదరుల కంటే ఇట్లాంటి బంధుత్వాలే ఎక్కువ ఆత్మీయంగా ఉంటాయి.

సెల్లు గురించి -
"బావతో చెప్పాకే నాకు చెప్పాలి. అలా ఐతే నాకిష్టం. " అంది. దానితో ఏం అనలేదు కాని మనసులో మెచ్చుకున్నాను."
ఆమె సెంటిమెంటు బావుంది. కొంతవరకూ నిజమే కూడా. ఎవరి సెల్లు వారిదైనప్పుడు ఎవరిఆత్మీయులు వారి వారి మాటలు వారితోనే మాట్లాడుకుంటారు.

సవ్వడి said...

Kotha Pali garu! Thankyou....

శ్రీలలిత said...

అక్క, తమ్ముళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ కూడా ఇంత ప్రేమ చూపించుకోవడమన్న పాయింట్ ని చాలా బాగా రాసారు. అది వారి మధ్య గల దగ్గరితనాన్ని మరింత దగ్గర చేసినట్టయింది.

సవ్వడి said...

శ్రీలలిత గారు! మా మధ్య జరిగిన సంభాషణని రాసేసాను. అంతే! మీరు కొత్తగా వివరించారు. బాగుంది. నచ్చినందుకు ధన్యవాదాలు.

పరిమళం said...

నిజంగా స్వీట్ రిలేషనే! ఇక్కడో విషయం చెప్పాలిమీకు అరేంజ్డ్ మేరేజ్ చేసుకున్న వాళ్ళ మధ్యకూడా ఇలాంటి స్వీట్ థింగ్స్ ఉంటాయండోయ్ :) :)

సవ్వడి said...

పరిమళ గారు!
<<< అరేంజ్డ్ మేరేజ్ చేసుకున్న వాళ్ళ మధ్యకూడా ఇలాంటి స్వీట్ థింగ్స్ ఉంటాయండోయ్ :) :) >>> ఉంటాయండోయ్ కాదండి ఇంకా ఎక్కువ ఉంటాయి. నా ఓటు అరేంజ్డ్ మేరేజ్ కే...
మీకు కూడా ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి said...

సవ్వడి గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

హారం