19.9.10

పుట్టిన రోజులు - సంఖ్యాశాస్త్రం ( తెలుగులో చెప్పాలంటే న్యూమరాలజి )

కంగారుపడకండి. నాకు తెలిసింది ఒకే ఒక్క విషయం.. నిర్భయంగా చదివేయండి. మీరు భయపడకుండా ఉండడానికి ముందు కొంత సోది చెప్తాలే. సరేనా!


నేను డిగ్రీ చదువుతుండగా ఒకరోజున ఉదయమే మా ఎకౌంట్స్ సార్ వచ్చి " ఈరోజు శాస్త్రి( మా కాలేజ్ డైరెక్టర్ )గారి పుట్టినరోజు. వెళ్లి విష్ చేయండి. " అని చెప్పి వెళ్లిపోయారు. మా కాలేజ్ మేనేజ్మెంట్ అంతా శాస్త్రి గారే చూసుకుంటారు. అంతే కాకుండా మా బి.కామ్ క్లాస్ తో సార్ చాలా క్లోజ్. అందుకే క్లాసు మొత్తం బయలుదేరాం. ఎప్పుడు క్లాస్ ఎగ్గొడదామా అని ఎదురు చూసే మేము వెంటనే బయలుదేరాం. సార్ గదిలోకి వెళ్లి అందరూ విష్ చేస్తున్నారు. " Happy Birth Day To You... " అని ఒకరు " Many Happy Returns of The Day " అని ఒకరు విష్ చేస్తున్నారు.

అప్పట్లో తెలుగు భాషని బతికిస్తున్నది.. పెంచి పోషిస్తుంది.. ఉద్ధరిస్తుంది నేను ఒక్కడినే అని గట్టిగా ఫీలైపోయేవాడిని. మరి తెలుగు భాషా ధురందరడునైన( దీనికి అర్థం మాత్రం అడగొద్దు. తెలీదు. ) నేను తెలుగులోనే చెప్పాలి కదా! అందుకే " పుట్టిన రోజు శుభాకాంక్షలు " అని షేక్ హేండ్ ఇచ్చాను. మా సార్ " తెలుగు... " అంటూ సంబరపడిపోయి.. నాకు షేక్ హేండ్ ఇచ్చి అలా నా చెయ్యి పట్టుకుని తన పక్కకు లాగి... అక్కడ ఉన్నంతసేపు నా భుజం పట్టుకునే మాట్లాడారు.

అదే రోజు మధ్యాహ్నం మా కంప్యూటర్స్ సార్ అనిల్ వచ్చారు. ఎలాగో గుర్తు లేదు కాని శాస్త్రి సార్ పుట్టినరోజు గురించి చర్చ వచ్చింది. మా ప్రెండ్ నన్ను చూపించి " అందరూ ఇంగ్లీష్ లో విష్ చేస్తే తను మాత్రం తెలుగులో విష్ చేసాడు సార్! " అంది. దానికి మా సార్ " తెలుగులోనా... " అంటూ సందిగ్ధంలో పడ్డారు. " ఏమన్నావు " అని ఆలోచిస్తూ " జన్మ.... దిన.... శుభాకాంక్షలు అన్నావా.... " అని విడగొడుతూ అడిగారు. అంత కష్టపడ్డావా అన్నట్లుగా అడిగారు. " లేదు సార్! పుట్టిన రోజు శుభాంకాంక్షలు అన్నాను. " అని చెప్తే " ఔను కదా! ఇది కూడా చెప్పొచ్చు " అన్నారు. అలా మా చర్చ సాగుతుండగా.. మాలో ఎవరమో " మీ పుట్టినరోజు ఎప్పుడు సార్! " అని అడిగాం. సార్ చెప్పారు. విచిత్రం... సార్, నేను ఒకేరోజు పుట్టాం.

ఈవిధంగా నా పుట్టినరోజు నాడే మరొకరిది... నాకు తెలిసి పరిచయం కూడా ఉన్న వ్యక్తిది అవ్వడం గుర్తుంచుకోదగ్గ విషయమే! నాకు తెలిసి పరిచయం లేని మరో అమ్మాయి.. మా ప్రెండ్ వివేక్ వాళ్ల మరదలు స్వాతి పుట్టినరోజు కూడా అదే రోజు. ఆవిధంగా నాకు ఇద్దరు తెలుసు. " ఓస్ ఇంతేనా... మాకు ఇంకా ఎక్కువ మంది తెలుసు " అంటారా... ఐతే ష్.. గప్ చుప్.. అంతే! నాకేం తెలీదు.

ఇప్పుడు కొన్ని నెలల్లో పుట్టిన వారి గురించి... నేను కనిపెట్టిన నిజాలు చెప్తాను. వినండి.

ఆగస్ట్ 4 న ఒక ప్రెండ్, 15న నా ప్రెండ్ కమ్ రూమ్ మేట్ 17న మా అక్క పుట్టారు. వీళ్లకి విపరీతమైన సహనం. ఎప్పుడూ కూల్ గా ఉంటారు. వీళ్లని చూసాక ఆగస్ట్ లో పుట్టినవారంతా ప్రశాంతంగా ఉంటారని ఫిక్స్ ఐపోయాను.

జూన్ 3న మా మావయ్య 12న ఒక ప్రెండ్ 30న మరో ప్రెండ్ పుట్టారు. వీళ్లకి పరిపక్వత(మెచ్యూరిటీ) ఎక్కువ. అంతే కాకుండా వీళ్లు నవ్విస్తారు. మనకు లేనివివే!

ఫిబ్రవరిలో మా తమ్ముడు, మరో తమ్ముడు( పిన్ని కొడుకు ), మరో ఇద్దరు చెలెళ్ళు( పిన్ని కూతుర్లు ) ఇంకా మా తల్లిగారు పుట్టారు. మాతల్లిగారు గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. వీళ్లు బుద్ధిమంతులు. ఎంత బుద్ధి అంటే అంత బుద్ధి... మరి నేను చెప్పలేను. " అంటే పై నెలల్లో పుట్టినవాళ్లు బుద్ధిమంతులు కారా " అని అడుగుతారేమో... మీరిలా మధ్యలో అడిగితే నాకు తెలిసిన ఆ ఒక్క విషయం చెప్పను. అన్నా... ముందు నేను చెప్పేది వినండి.

అసలు సంగతి ఏంటంటే ఆగస్ట్ లో పుట్టినవాళ్లకి పరిపక్వత ఉంది. బుద్ధి ఉంది. జూన్ లో పుట్టిన వాళ్లకి సహనం ఉంది. బుద్ధి ఉంది. ( ఎటొచ్చి ఫిబ్రవరిలో పుట్టినవాళ్లకే మిగతా గుణాలు ఉన్నాయో లేవో తెలీదు ). ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేను కనిపెట్టిన నిజాలు దేనికీ పనికిరావు. ఇది అసలు నిజం! ఓ గొప్ప నిజం!

సోది సమాప్తం.

మరో సోది ప్రారంభం...

నేను టివి చూసేటప్పుడు మొదట మన జెమిని, మా, జీ తెలుగు చూస్తాను. వీటిలో సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు వస్తే చూస్తాను. లేకపోతే వెంటనే HBO, Star... ఇంగ్లీష్ సినిమా చానెళ్లు మీద పడతాను. వీటిలో కూడా పూర్తి ఏక్షన్ మూవీస్ వస్తేనే చూస్తాను. లేకపోతే మళ్లీ చేంజ్... ఈసారి దాడి సంగీతం చానెళ్లు మీద... అవి కూడా బోర్ కొడితే వార్తా చానెళ్లు. చూశారా మొదట చూడాల్సినవి చివర చూస్తున్నాను. అదీ టేలెంట్ అంటే! ఈవిధంగా వెళ్తున్న నేను ఒకసారి జెమిని మ్యూజిక్ దగ్గర ఆగాను.

అప్పుడు సమయం ఒంటిగంట ఐంది. ఒక వ్యక్తి ఎఱ్ఱ తేనీరు చొక్కా( టీ షర్ట్ ) వేసుకుని వచ్చాడు. వెనుక మసక మసకగా పిచ్చి పిచ్చిగా ఏదో డిజైన్ ఉంది. అప్పుడు ఆ ఏంకర్ " విషయమేమిటంటే " అన్న కార్యక్రమం ప్రారంభించాడు. " వాడు అలా చెప్పడమే మా ప్రాణానికి వచ్చిందన్నమాట! " అని తిట్టుకుంటున్నారా... అబ్బా దగ్గరకొచ్చేశాం! ఓ రెండు నిమషాలు ఆగి తిట్టుకోండి. వాడు చెప్పిన విషయమేంటంటే...

ఇంట్రడ్యూసింగ్ " న్యూమరాలజి "

" సంఖ్యాశాస్త్రాన్ని " పరిచయం చేస్తున్నాం....... ఏది గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టారా...

గుడ్!

" 1,10,19,28... ఈ తేదీల్లో పుట్టినవాళ్లు ఎప్పుడూ నెం. 1 గా ఉండాలనుకుంటారట! అలా ఉండడానికి ప్రయత్నిస్తారట! కనీసం నెంబర్ వన్ గా ఉండాలని ఆలోచిస్తారట! ఈ తేదీల్లో ఓ విశేషం ఉంది. వాటిని కలిపితే ఒకటే వస్తుంది. ఉదా: 1,9 కలిపితే 10. మళ్లీ ఆ " 1 " ని " 0 "ని కలిపితే 1 వస్తుంది కదా! అలా అన్నమాట. మిగతావి కూడా అంతే! "

చూశారా ఎంత మంచి విషయం చెప్పానో! ఇప్పుడు నన్ను అందరు పొగడండి. " విషయం తెలిసిపోయిన తరువాత ఇంకెందుకు పొగుడుతాం! కావాలంటే తిడతాం గాని... " అంటారా! ఐతే మళ్లీ నేను ష్.. గప్ చుప్!

ఈ శాస్త్రాలు ఎన్ని చెప్పినా పూర్తిగా మన గురించి చెప్పలేవు. మీరేమంటారు!