17.12.10

కాపీ కొట్టి సంవత్సరం ఐయ్యింది...( బ్లాగులపై నా అభిప్రాయాలు )

2009 అక్టోబర్ లో నాకు ఉద్యోగం వచ్చింది. నా టేలంట్ గ్రగించేసారేమో వెంటనే పనులేవి అప్పజెప్పకుండా వాళ్ల పక్కన వీళ్ల పక్కన కూర్చొని వాళ్లు ఎలా చేస్తున్నారో చూడమని చెప్పారు. అలా చూస్తూ కూర్చోవడం వల్ల పని కన్నా ముందు నిద్ర వచ్చేది. ఆవిధంగా చక్కగా కళ్లు మూతలు పడుతుండగా నిద్రమత్తుతోనే పని నేర్చుకునేవాడిని.


మా కొలీగ్స్ లో మూర్తి అని ఒకరు బ్యాంక్ పనులు చూస్తుంటాడు. అతనికి వారంలో మూడు రోజులు బ్యాంక్ కి వెళ్లే పని ఉండేది. ఇంకేం దొరికింది ఛాన్స్ అనుకుని అతను వెళ్లినప్పుడల్లా అతని సిస్టం తీసుకుని కూడలి, జల్లెడ ఓపెన్ చేసి చూసేవాడిని.

నేను డిగ్రీ చదువుతున్నప్పుడే బ్లాగుల గురించి, బ్లాగుల సమూహాల గురించి చదివాను. ఆవిధంగా నేను మొట్టమొదట తెలుసుకున్న బ్లాగు సుజాత గారి " మనసులో మాట ". ఈ బ్లాగు అడ్రెస్ ని సెల్ లో సేవ్ చేసుకున్నాను. ఆ బ్లాగుని తరువాత ఎప్పుడో మావయ్య లేప్ టాప్ లో చూశాను.

కంపెనీలో జాయిన్ ఐయ్యాక తరచూ చూస్తుండడం వల్ల అన్నీ గుర్తుంచుకోవడం ప్రారంభమైంది. అలా నేను చూసిన మంచి బ్లాగులు... అంటే నాకు గుర్తున్నవి " స్వాతి చినుకులు ", " పరిమళం ". ఈ రెండు బ్లాగుల్లో ఉన్న పోస్టులన్నీ చదివేసాను. ఈ బ్లాగులే నన్ను ఓ బ్లాగు క్రియేట్ చేసుకునేలా చేసాయి. ఈ రెండు బ్లాగుల గురించి నా మొట్టమొదటి పోస్ట్ " సవ్వడి " లో రాసాను. చూడండి.

ఈ నా మొట్టమొదటొ పోస్ట్ గత సంవత్సరం డిసెంబర్ లో పెట్టాను. ఈ డిసెంబర్ కి ఒక సంవత్సరం నిండిపోయింది. అదన్నమాట విషయం..

ఇప్పుడు ఒకసారి నా టెంప్లేట్ ని పరిశీలించండి. అలాగే " పరిమళం " బ్లాగు టెంప్లేట్ గుర్తు తెచ్చుకోండి. అదే చేత్తో నా ప్రొఫైల్ చూడండి. ఇప్పుడు పరిమళ గారి ప్రొఫైల్ చూడండి. చూశారా... మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్లు అనిపించట్లేదు. ఆ గ్రీన్ కలర్, జిల్లా గురించి ప్రస్థావన అంతా కాపీనే! అందుకే కాపీ కొట్టి సంవత్సరం ఐంది అని చెప్తున్నాను. ఎంత ధైర్యంగా చెప్తున్నానో చూసారా కాపీ కొట్టానని..:)

బ్లాగులపై నా అభిప్రాయాలు

ముందుగా మా జిల్లాకు చెందిన బ్లాగర్ల గురించి చెప్తాను.

ఏటిగట్టు

ఏటిగట్టు ఎలా ఐతే చల్లనిగాలితో ప్రశాంతంగా హాయిగా ఉంటుందో శేఖర్ చెప్పే విషయాలు అలాగే హాయిగా చదివిస్తాయి. మురళి గారు చాలా చక్కగా పరిచయం చేసారు. ఇక్కడ చదవండి.

శేఖర్ రాసిన టపాల్లో నాకు బాగా నచ్చినది " బ్రతికుండాగా నీ పిలుపులు నేను విన్నా..! " అని తను రాసిన టపా! ఈ పాటపై తన ఊహ చాలా బాగుంది. సాధారణంగా ఏవైనా పాట విన్నప్పుడు అప్పటికి ఆ సినిమా రిలీజ్ కాకపోతే ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ఊహించుకుంటాం. ఆ పాట చూశాక మనం ఊహించుకున్నదానికంటే బాగుంటే బాగుందని లేకపోతే లేదని అనుకుంటాం. అంతేకాని ఆ పాటని మరో విధంగా ఊహించలేం.

కాని శేఖర్ ఈ పాటని చాలా అందంగా ఊహించాడు. సినిమా రిలీజైన ఎన్నో రోజుల తరువాత ఒక పాటని ఈవిధంగా ఊహించగలగడం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన ఊహాశక్తి సూపర్! తనో మంచి భావకుడని కూడా అర్థమైంది. ఐ లైక్ హిమ్.

Free Hugs

ఫ్రీ హగ్స్... ఈ పేరులోనే భావుకత కనీకనిపించకుండా అల్లరి చేస్తున్నట్లుంటుంది. ఇందులో కొన్ని పోస్ట్ లు చదువుతుంటే ఆ భావుకతే వచ్చి హగ్ చేసుకున్న భావం కలుగుతుంది. ఈ బ్లాగుకి మురళి గారి పరిచయం చదవండి.

తను రాసిన ఇన్నర్ డైమన్షన్స్ లో షి స్పీక్స్ కాని అమ్మకు పూలు పూచాయి కాని చదివినప్పుడు తను అన్ కండీషనల్ గా ప్రేమించిగల వ్యక్తి అని తనో స్వాప్నికుడు అని అర్థమైంది.ఇప్పుడు బ్లాగుపేర్లలో నాకు నచ్చినవి చెప్తాను వినండి. అన్ని పేర్లు మంచివే! కాని ఈ పేర్లలోనే అత్యుత్తమమైనవి తీస్తే నేను మొదతి ర్యాంక్ ఇచ్చేది ఈ పేరుకు. అది " వెన్నెల సంతకం " ఈ పేరు చాలా నచ్చింది. ఈ పేరుకి ఆవిడ ఇచ్చిన నిర్వచనం ఇది.. << ప్రకృతి నాకు స్ఫూర్తి... అమ్మ నాకు ఆదర్శం... సంగీతం నా జీవన రాగం... నృత్యం నా జీవిత గమనం... కవిత్వం నా మనోగతం.... ఆత్మవిశ్వాసం నా బలం... ప్రేమ నా మతం... స్నేహం నా అభిమతం... వెరసి... నేను చేస్తోన్న వెన్నెల సంతకం... >> కాని నాకా పేరు చూడగానే ఓ ఊహ నా కళ్లముందు మెదులుతుంది..... " పెద్ద నందనవనం... ఎటు చూసినా పూరెమ్మలే... విరగబూసిన వెన్నెలలో... హేమంత సరాగంలా వీస్తున్న గాలిలో ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఒకరి చేయి ఒకరు పట్టుకుని చెప్పుకున్న బాసలే వెరసి వెన్నెల సంతకం ". ఈ బ్లాగుని ఫాలో అవడానికి సగం కారణం ఈ పేరే!

బ్లాగుపేర్లలో నాకు నచ్చిన రెండో పేరు " మంచు పల్లకీ ". మంచుతో పల్లకీ ఏమిటో నాకర్థం కాదు. కాని ఇట్ ఈజ్ నైస్ నేమ్.ఇప్పుడు నాకు నచ్చిన టపాలు చెప్తాను వినండి. ఉత్తమ చిత్రం లాగా ఉత్తమ టపా లింద ఈ పోస్ట్ కి ఇస్తున్నా... ఈ పోస్ట్ మధురవాణి బ్లాగులో ఉంది. ఇప్పటివరకూ ఎన్ని టపాలు చూసానో తెలీదు కాని ఈ టపా నచ్చినంతగా ఏదీ నచ్చలేదు. ఈ టపా పేరు " చందమామతో ఊసులు ".

మధురవాణి బ్లాగు గురించి పరిచయం చేస్తూ మురళి గారు ఇలా అన్నారు. << ఆ బ్లాగు లో టపాలు చదువుతూ ఉంటే రోజూ మన కళ్ళెదురుగా తిరిగే పక్కింటి అమ్మాయి గలగలా చెబుతున్న కబుర్లు వింటున్నట్టుగా ఉంటుంది. >> ఇది చదివిన తరువాత మధు పోస్టులు కొన్ని చదివినప్పుడు " నిజంగానే ఈ అమ్మాయి మన పక్కింట్లో ఉంటే ఎంత బాగుండేది. " అని అనిపించింది.:)

ఉత్తమ ద్వితీయ టపా కింద కృష్ణ గీతం లో ఉన్న ఈ టపాకి ఇస్తున్నాను. " ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్యకు సమర్పణలతో " అన్న పేరుతో ఉన్న ఈ టపా నాకు నచ్చిన మరో మంచి టపా. ఈ పోస్ట్ చదువుతుంటే కళ్లు తడి ఐయ్యాయి. గ్రేట్ పోస్ట్..!

ఇప్పటివరకూ మూడువేలకు పైగా కామెంట్లను చదివి ఉంటాను. వీటిలో ది బెస్ట్ కామెంట్ ఏది అని ఆలోచిస్తే.... ఈ టపాకే పరిమళ గారు పెట్టిన కామెంట్ కు ఇస్తున్నా! పరిమళ గరి కామెంట్ ఇది... <<<< ఇదో అద్భుతం .........మాటల్లేవంతే....దాదాపు టపా చదివిన పావుగంటకు కామెంట్ రాస్తున్నా ...భావన గారు , మీబ్లాగ్ కృష్ణ గీతం ఐతే ...మీరు కృష్ణ మానస !! >>>> సో పరిమళ గారి అండదండలతో భావన గారి పేరును " కృష్ణ మానస " గా మార్చేస్తున్నాను.:)

కామెంట్లలో నెంబర్ టూ దేనికి ఇవ్వట్లేదు.

ఇప్పుడు నేను మేచింగ్ బ్లాగులు గురించి చెప్తాను వినండి. బెస్ట్ మేచింగ్ అవార్డ్ అన్నమాట ఇది. అంటే బ్లాగు పేరు - బ్లాగు టెంప్లేట్ - బ్లాగులో పెట్టిన ఫొటో కలయికలో ఏ బ్లాగు బాగుందో చెప్తానన్నమాట. విచిత్రమేంటంటే ఈ కేటగిరిలో కూడా మొదటి రెండు మధురవాణి, కృష్ణ గీతం బ్లాగులే దక్కించుకున్నాయి.

మొదటి స్థానం మధురవాణి బ్లాగుకే ఇద్దామనుకున్నాను. కాని తను రీసెంట్ గా ఫొటో మార్చింది. మధురవాణి పేరులో ఉన్న స్వీట్ నెస్ ఇప్పుడున్న ఫొటోలో లేదు. తను ముందు పెట్టిన ఫొటోలో కనిపించేది. తన బ్లాగు చూసిన ప్రతీసారి ఆ ఫొటోని చూసేవాడిని. ఆ టెంప్లేట్ కూడా బాగుంటుంది. ఆవిధంగా మొదటి స్థానం ఇద్దామనుకున్నాను. కాని ఫొటో మార్చేయడం వల్ల మొదటి స్థానం కృష్ణ గీతం కు ఇస్తున్నాను.

రెండో స్థానం : మధురవాణి

మూడో స్థానం : కొత్త పాళీ

నాల్గో స్థానం : నెమలి కన్ను


కొత్త పాళీ

నాకు కొత్తపాళీ గారు ఎంత ఇష్టమంటే అంత ఇష్టం. బ్లాగ్లోకంలో ఎవరికీ ఏ సందేహం వచ్చినా కొత్తపాళీ గారి దగ్గరి నుండి సమాధానం వస్తుంది. కొత్తపాళీ గారికి తెలియినది లేదనుకుంటాను. ఈ బ్లాగులో ఉన్న తెలుగు పాఠాలన్నీ ప్రింట్ తీసుకుని దాచుకోవాలని ఉంది.

మీకు మంచి పుస్తకాలు చదవాలనుకుంటే ఈ పోస్ట్ చూడండి. మాయా దుప్పట్లు అంటూ రాసిన ఈ పోస్ట్ నచ్చింది. వీటిలో కొనాల్సినవి చాలా ఉన్నాయి.

నెమలి కన్ను

మురళి గారు పరిచయాలు ఎంత బాగా రాస్తారో...! అతని పరిచయాలు ముఖ్యంగా బ్లాగర్ల గురించి రాసినవి ఎక్సలెంట్ ప్లస్ ప్లస్ అన్నమాట. మురళి గారు అందరికీ ఇష్టమైన బ్లాగర్.

పరిమళం

ఈ బ్లాగు గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఒకే ఒక్క విషయం చెప్పాలి. అదేంటంటే ఈ బ్లాగు వల్లే నేను బ్లాగులను ఫాలో అవడం ప్రారంభించాను.

నేను బ్లాగు క్రియేట్ చేసుకున్నప్పుడు ఓ ఆరు బ్లాగుల్లో ఫాలోయర్ గా జాయిన్ ఐయ్యాను. తరువాత డేష్ బోర్డ్ చూస్తే అవన్నీ కనిపిస్తున్నాయి. నేను ఆశ్చర్యపోయి " నా బ్లాగులో వేరే బ్లాగులా.... ఎంత అవమానం ఎంత అవమానం " అనుకుని అన్ని బ్లాగుల్లో అన్ ఫాలో ఐపోయాను..:):)

ఆ తరువాత పరిమళగారు పెట్టిన " ఆత్మహత్యలెందుకు? " పోస్ట్ చదివాక ఈ బ్లాగుని ఫాలో అవడం చేసాను. అలా అలా ఇప్పుడు 31 బ్లాగులను ఫాలో అవుతున్నాను. దీనికి మన మధురవాణి స్పూర్తి!

జాజిపూలు

తనివితారా నవ్వాలన్నా... కడుపు చెక్కలయ్యేలా నవ్వాలన్నా జాజిపూలనే చూడలి. నేను అన్ని పోస్టులు చదివిన మూడో బ్లాగు ఇది.

ఈ బ్లాగులో నాకో చిన్న లోపం కనిపించింది. అది బ్లాగులో పెట్టిన ఫొటో! ఆ ఫొటో కూడా బాగుంది. కాని మన తెలుగుదనం లేదు. నేస్తం గారి కబుర్లతో మేచ్ అవ్వట్లేదు. ఇంకా మంచి ఫొటో పెడితే బాగుండేది అని అనిపించింది.

నేను బ్లాగ్లోకంలోకి వచ్చిన తరువాతే ఫేమస్ బ్లాగులన్నీ పేపర్ లో వచ్చాయి. పరిమళం, మానస వీణ, ఏటి గట్టు, నెమలి కన్ను, మధురవాణి.. ఇలా అన్నీ వచ్చాయి. మన జాజిపూలు కూడా రావాలి అనుకుని రూమ్ లో పెన్ను, పుస్తకం తీసుకుని కూర్చున్నాను. ఓ పావుగంట కూర్చుని ఒక అక్షరం కూడా రాయకుండా మనవల్ల కాదులే అని వదిలేసాను. ఐనా ఏమని రాస్తాం చెప్పండి. మొత్తం మూడొంతుల పోస్టుల గురించి రాయాలి. కరక్టే కదా!

జాజిపూలు గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి! బ్లాగ్లోకంలోకి వచ్చిన వాళ్లకి ఈ బ్లాగు గురించి తెలియకుండా ఉండదు. తెలిసాక ఫాలో అవకుండా ఉండరు..:) ఈ బ్లాగులో ఓ పది పదిహేను పోస్టులు బాగా నచ్చినవి ఉన్నాయి. అందుకే దేని గురించి చెప్పట్లేదు..:):)

ఈ బ్లాగులో మొదటి కామెంట్ పెట్టాలన్న కోరిక తీరలేదు..:)

పద్మార్పిత

నన్ను బ్లాగ్లోకంలోకి సాదరంగా ఆహ్వానించిన మొదటి వ్యక్తి. నా బ్లాగులో మొదటి కామెంట్ పెట్టింది తనే అన్నమాట. కవితలు, బొమ్మలు మల్టీ టేలెంటడ్ అమ్మాయి. నాకు నచ్చిన విషయమేంటంటే... జీవిత సత్యాల గురించి వేదాంతం గురించి ప్రేమ గురించి కవితలు రాసేస్తుండండం. అర్థం కాని విశ్హయం కూడా ఇదే..:)

మాయాశశిరేఖ

ఈ పేరు చూడగానే మాయా బజార్ సినిమానే ఎక్కువగా గుర్తు వస్తుంటుంది..:) మరో తెలివైన బ్లాగర్ మన సౌమ్య. తను రాసిన " చెక్కిన చేతులకు జోహార్లు " పోస్టుల సిరీస్ నాకు బాగా నచ్చాయి. తన పేరు గురించి వివరిస్తూ రాసిన టపా కూడా నచ్చింది.మనసులో మట


నాకు మొట్టమొదట తెలిసిన బ్లాగు ఇది. ఈ బ్లాగు చిరునామా మాత్రం ఇప్పటకీ గుర్తు లేదు. డేష్ బోర్డ్ లో చూసుకోవడమే..:)


సుజాత గారి గురించి ముందు నాకు తెలీదు. మనలాంటివారే అనుకున్నాను. ఆవిడ పెద్ద పెద్దవాళ్లని ఇంటర్ వ్యూ చేయడం పేపర్లో చూశాక గొప్పవారని అర్థమైంది. ఇంకా " తెలుగుబాటలో తెలుగుకై నడుద్దాం " అని ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసాక ఆవిడకు పెద్ద అభిమానినైపోయాను..:)జ్యోతి


జ్యోతి గారంటే నాకు భలే ఇష్టం. పది బ్లాగులను నిర్వహిస్తున్నారు. " బ్లాగు గురువు " గా అందరికీ సలహాలు ఇస్తుంటారు. ముఖ్యంగా " ఆముక్తమాల్యద " కు ఫాన్ ని ఐపోయాను.మానస వీణ


భావుకతకి కేరాఫ్ అడ్రెస్ ఈ బ్లాగు. ఇంకా చెప్పాలంటే భావుకతనే అందంగా ముస్తాబు చేసి తన బ్లాగుకి అలంకారంగా పెట్టుకున్నారు మన నిషిగంధ గారు.ఈవిడకి ఓ విషయం చెప్పాలి. ఈవిడ రాసిన " ఊసులాడే ఒక జాబిలట " ప్రింట్ తీసుకుని చదివాను. చదివి ఆరు నెలలు దాటిపోయింది కాని ఇంకా చెప్పలేదు. నాకు బాగా నచ్చింది. ఈ కథని మా అమ్మగారికి ఇచ్చాను. మా అమ్మగారికైతే ఇంకా నచ్చింది. " ఉత్తరాల్లోనే వాళ్ల కుటుంబాల పరిచయం , ఏకంగా ఊర్ల పరిచయం చాలా బాగుందిరా! " అన్నారు. మాకు చాలా బాగా నచ్చేసింది.నిషిగంధ గారు, నేస్తం గారు, కొత్త పాళీ గారు, జ్యోతి గారు, శ్రీ లలిత గారు, సౌమ్య.... వీళ్లు రాసిన కామెంట్లను 90% మిస్ అవను. ఆ పోస్టులు చదివినా చదవకపోయినా, మిగతా కామెంట్లు చదివినా చదవకపోయినా, అసలీ కామెంట్లు ఎందుకు చదవాలో అర్థం కాకపోయినా చదవడం ఐతే చేస్తాను..:)శ్రీ లలత


ఈవిడ కామెంట్లు చూసే ఈ బ్లాగును ఫాలో అవడం ప్రారంభించాను. మరో మంచి బ్లాగర్. వాన గురించి, కృష్ణుడు గురించి ఎంత బాగా రాసారో చెప్పలేను. ఈవిడ రాసిన " నా ఎంకి పాట " చాలా నచ్చింది.తూర్పు-పడమర


ఒక బ్లాగుని ఏమాత్రం చూడకుండా... అంటే వాళ్ల పోస్టులు ఒకటి కూడా చదవకుండా ఫాలో అవుతున్న బ్లాగు ఇదొక్కటే. " యమకూపం " నవల గురించి సుజాత గారు పరిచయం చేసినప్పుడు తెలిసిన ఓ విషయం వల్ల వెంటనే అనుసరించడం ప్రారంభిచాను. యమకూపం రచయిత రెంటాల గోపాల కృష్ణ గారు కల్పన గారికి నాన్నగారు అని తెలిసిన వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా ఫాలో ఐపోయానన్నమాట. అదీ విషయం..:)దిరిసెన పుష్పాలు, కృష్ణప్రియ డైరీ... నాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న మంచి బ్లాగులు.ఎదసడి, నా స్పందన, మనసు పలికే, జాజిమల్లి.... ఫైన్ బ్లాగ్స్.


పై అభిప్రాయాలలో సగం నేను బ్లాగు క్రియేట్ చేసుకుంటున్నప్పుడు... అన్నీ చూసినప్పుడు కలిగినవే!


నేను ఇంతవరకూ బ్లాగులో నేను రాసిన కథల గురించి గాని రాయబోయే కథల గురించి కాని చెప్పలేదు. మొదటసారి చెప్పాలని అనిపిస్తుంది. కాబట్టి ఓ కథలో జరిగే సన్నివేశాన్ని చెప్తున్నాను వినండి.
----------------------------------------------------

శశి నవ్వుతూ కారు దిగి డోర్ వేస్తూ " దిగు " అన్నాడు శిరీషతో! శిరీష అలాగే చూస్తూ " ఆ నవ్వుకి అర్థమేమిటబ్బా.. " అనుకుంది. " నేనే ప్రపోజ్ చేసానని అనుకుంటున్నాడేమో... అస్సలు కాదు. " అనుకుని కారు దిగి శశి ఎదురుగా నిల్చుంది.  
" నేనంటే ఇష్టమా... " నవ్వుతూ కాస్త ఆలోచిస్తూనే అడిగాడు.
" ఊ... " అని చెప్పి " నాదో కోరిక.... " అంది. స్నేహితులతో ఎలా మాట్లాడుతామో అలాగే అడిగింది.
" చెప్పు " కుతూహలంగా అన్నాడు.
" వెంటనే పెళ్లి చేసుకుందాం! " అంది. శశి విస్మయంగా చూశాడు. " ఇష్టమే అని చెప్పి క్షణం కూడా కాలేదు. అంతలోనే పెళ్లా.. " అన్నది తన సందేహం.
శిరీష నవ్వి " ఏ క్షణంలోనైనా నీపై ప్రేమ పుట్టొచ్చు. ఆ ప్రేమను నేను ఆస్వాదించే సమయానికి అంటే నా ప్రేమ వికసించే సమయానికి..... " ఓ క్షణం ఆగి " నాకంటూ ఏ హద్దులు ఉండకూడదు. " అని తన దోసిళ్లను చూపించి తనకి దగ్గరగా తెచ్చుకుని " ప్రేమను నేను చేతుల్లోకి తీసుకునేసరికి నాకున్న హద్దులు చెరిగిపోవాలి "  అంది. తరువాత చేతులు కట్టుకుని " ప్రేమించిన రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అప్పటికి ప్రేమ సుగంధాలు కొంతైనా చెదిరిపోతాయి. అలాగే పెళ్లి చేసుకున్నాక పుట్టే ప్రేమ కూడా ఇష్టం లేదు. భార్యగా పుట్టే ప్రేమను తరువాత ఆహ్వానిస్తాను. " అని ముగించింది.
తను చెప్పింది అర్థమౌతుండగా శశి పెదవులు విచ్చుకున్నాయి. తన నవ్వు చూసి శిరీష చెప్పింది. " When love is real, you don't get over it at all, it stays with you forever, expanding your heart and enabling you to love others more deeply. Love is a gift child, a grace. "
శశి నెమ్మదిగా తల ఆడించి " అర్థం కూడా చెప్పు. నాకు తెలిసీ ఆ లైన్లు ప్రత్యేక సందర్భంలో వాడినవి. సరైన అర్థం అది చదివినవాళ్లకే తెలుస్తుంది. " అన్నాడు.
అది నిజమో కాదో తెలీదు కాని అర్థం తెలుసు కాబట్టి చెప్పింది. " నిజమైన ప్రేమ ఎప్పుడూ ముగిసిపోదు మరియు అది ఎప్పుడు నిన్ను వదలదు. అంతే కాకుండా అది నీ మనస్తత్వం తెలుసుకుని ఇంకా ఎక్కువమందిచే అతిగా ప్రేమించబడుతుంది. " అని శశి కళ్లలోకి చూసింది.
శశి నవ్వుతూ " హ్మ్... " అంటూ తన నుదురుతో శిరీష నుదురుపై నెమ్మదిగా తట్టాడు. నువ్వు వెళ్లి కూర్చో! నేను వాళ్లకి థాంక్స్ చెప్పి వస్తాను. " అని వెళ్లాడు. శిరీష నవ్వుతూ తల దించేసింది. ఆ నవ్వులో చిన్న సిగ్గు. అది చూసి నవ్వుతూ వెళ్లాడు శశి. 
--------------------------------------------------

పై కథకి ఇంకా పేరు పెట్టలేదు. ఇది జర్నీ బేస్డ్ లవ్ స్టోరి. ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు.


చివరగా ఒక్క నిజం చెప్పేస్తాను వినండి. ఈ బ్లాగింగ్ వల్ల నా టైమ్ బాగా వేస్ట్ అవుతోంది. పెద్ద టపాలు పెట్టేముందు ప్రతీసారి ఓ మూడు నాలుగు రోజులు నిద్ర కూడా ఉండట్లేదు. కాబట్టి బ్లాగింగ్ మానేస్తున్నాను.
ఓ ఐదు సంవత్సరాల తరువాత మళ్లీ ప్రారంభిస్తాను. అంతవతరకూ బై మిత్రుల్లారా!

అందరికీ ధన్యవాదాలు. బ్లాగు మిత్రులకు, ఎగ్రిగేటర్లు నిర్వహిస్తున్నవారికి ఇంకా నా బ్లాగులో కామెంట్ పెట్టినవారికి పేరు పేరున మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

17 comments:

సుజాత said...

నా బ్లాగు URL మీకే కాదు, నాకూ గుర్తుండేది కాదు మొదట్లో!:-)) ఇప్పటికీ కొద్దిగా confuse అవుతుంటాను. మొదట్లో బ్లాగర్ అంటే ఏమిటో కూడా తెలీని రోజుల్లో క్రియేట్ చేసుకున్న blog కదా! అందువల్ల ఏదేదో చేసి అలా సెట్ చేసానన్నమాట. ఇప్పుడు మారుద్దామని ఉంటుంది కానీ అందరికీ ఇదే అలవాటైపోయింది.

మొత్తానికి మీ ఓపికకు అభినందనలు! ఇన్నేసి బ్లాగులు చదవడమే కాక వివరంగా రాశారు.

వేణూ శ్రీకాంత్ said...

Thanks సవ్వడి గారు, నేను మిస్ అయిన కొన్ని మంచి టపాలు చూడగలిగాను. మరీ ఐదేళ్ళు బ్రేక్ అంటే టూలాంగ్ అండి ఐదునెలలకి కుదించేయండి :-)

geetika said...

చాలా బాగుంది... మీరు వ్రాసిన కథలోని చిన్న భాగం. ఇష్టమున్న ఇద్దరి మధ్య మొదలవబోయే ప్రేమ సన్నివేశాన్ని చాలా సున్నితంగా చెప్పారు.

కానీ... ఎందుకిలా బ్లాగుని పూర్తిగా వదిలెయ్యడం...? వీలున్నప్పుడు ఓ గంట కేటాయించినా చాలేమో అనుకుంటున్నాను. ఆలోచించండి.

కృష్ణప్రియ said...

5 యేళ్ళకి బ్లాగ్సన్యాసం? వద్దండీ .. నేస్తం గారు వెళ్ళారనే.. వెలితి గా అనిపిస్తుంది... కనీసం చూస్తూ ఉండండి.. బోర్ గా ఉన్నప్పుడో,.. ఏదైనా అందరికీ చెప్పాలనిపించినప్పుడో రాయండి?

కొత్త పాళీ said...

తమాషాగానూ వెరైటీగానూ రాశారు .. ప్రొఫైలు విషయాల్ని కాపీ కొట్టారారా? హ హ.
నా రాతల పట్ల మీ అభిమానానికి నెనర్లు.
వేణూ చెప్పినట్టు ఐదేళ్ళొద్దుగాని, ఒక ఐదు నెల్లు వెకేషన్ తీసుకుని మళ్ళొ వచ్చేసెయ్యండి.

ఇందు said...

నా బ్లాగ్ పేరు మీకు అంతగా నచ్చినందుకు...ధన్యవాదాలు...అలాగే..దాన్ని మీరు నిర్వచించిన తీరు అద్భుతం.అంత చక్కగా నేను వ్రాయలేకపోయాను :( .కానీ మీరు బ్లాగ్ ఎందుకు వ్రయకుండా ఉండటం? టైంలేకపోతే..చిన్ని చిన్ని టపాలే వ్రాయండీ....మంచి బ్లాగులు వ్రాసే వారు చాల తక్కువండీ..అలాంటివారు కూడా ఇలా వెళ్ళిపోతే ఎలా? మీరు కనీసం వారాంతాలైనా వీలు చూసుకుని టపాలు వ్రాసి బ్లాగింగ్ కొనసాగించాలని ఆశిస్తున్నా!

సవ్వడి said...

సుజాత గారు! ధన్యవాదాలు!
మీ బ్లాగు యు.ఆర్.ఎల్. మీకు confuse గానే ఉంటుందా.. ఐతే ఒ.కె..:):)
నా ఓపికేముందండీ. మీ ఓపికకి జోహార్లు.. ప్రతీ నెలా ఎన్నో కథలు పరిచయం చేస్తూ.. ఎన్నో రాస్తుంటారు. మీకే జోహర్లు.. థాంక్యు మరోసారి.

వేణు ! మా అభిమానానికి థాంక్యు.
ఐదేళ్లు కాదు గాని మూడేళ్లు మాత్రం గ్యారెంటీ.. i need this time..

గీతిక గారు!
నా కథలో చిన్న భాగమే పెట్టినా చక్కగా వివరించి.. నచ్చిందన్నారు. చాలా థాంక్స్!
బ్లాగింగ్ కి ఓ గంటో రెండు గంటలో కేటాయిస్తే చాలదండి. ఇంకా ఎక్కువ టైమ్ అవసరం. నావల్ల కాదు. మీ సలహాకు చాలా ధన్యవాదాలు.

సవ్వడి said...

కృష్ణ ప్రియ గారు!థాంక్యు..
బాగా వీలు కుదిరినప్పుడో, బోర్ గా ఉన్నప్పుడో చూడమన్నారు. ఏమో చూద్దాం..:):)
నేస్తం గారు వచ్చేస్తారులెండి..:)

కొత్త పాళీ గారు!
ఔనండి. నా ప్రొపైల్ లో ఏమి రాయాలో అని ఆలోచించి అందరి ప్రొపైల్స్ చూసి అలా కాపీ కొట్టాను.:)
ఐదు నెలలు చాలంటారా..:) మీ అభిమానానికి ధన్యవాలు.:)

ఇందు గారు!
మీ బ్లాగు పేరు మాత్రం చాలా నచ్చింది.
నా డిస్క్రిప్షన్ నచ్చిందా.. థాంక్యు!
ఇక వారాంతాలంటారా వద్దులెండి.. మీ అభిమానానికి కూడా థాంక్స్..:)

మధురవాణి said...

అయ్య బాబోయ్! ఇన్నేసి ప్రశంసలే! ఇవాళ్టికి ఇహ అన్నం తినక్కర్లేదండీ నేను! వెలకట్టలేని మీ అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు చెప్పిన ఆ చందమామ పోస్టంటే నాక్కూడా చాలా ఇష్టం. :) అయితే, ఫోటో మార్చడం వల్ల మార్కులు తగ్గాయన్నమాట నాకు! ;)
ఇదంతా బాగుంది గానీ, మీరు బ్లాగింగు మానేస్తాననడం బాధగా ఉందండీ! ఏదేమైనా, మీరంత గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి.. మీ మనసుకి నచ్చిన పని చేయండి. అన్నిటా మీకు జయం కలగాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
మధుర

సవ్వడి said...

మధుర!
Thank You...................................... so much for your wishes and wish you the same...
ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు..:) థాంక్స్ ఎ లాట్:):):)

నేస్తం said...

నన్ను కూడా తల్చుకున్నారా :) థేంక్యూ వేరీ మచ్..కాస్త ఆలస్యం గా చూసాను ..నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆ.సౌమ్య said...

ఏంటి నిజమే...నా బ్లాగంటే అంత అభిమానమా? బాబోయ్ మరీ అంతగా పొగిడేయకండి. నా బ్లాగు, నా కామెంట్లు మీరు ఫాలో అవుతారన్న విషయం చదివి చాలా ఆనందంగా అనిపించింది.....కృష్ణా మీ అభిమానానికి కృతజ్ఞతలు. :)

అసలు ఈ పోస్ట్ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానో! నేను ఇప్పుడే చూస్తున్నా.

మీరు వర్షం మీద రాసిన పోస్ట్ నకు నచ్చింది. అప్పటినుండే మీ బ్లాగు చూడడం మొదలెట్టాను...ప్రాంతీయ అభిమానం కూడా కొంత ఉందనుకోండి. :D

అయినా మరీ ఐదేళ్ళు బ్లాగు సన్యాసం పుచ్చుకోవడమేమిటి? వద్దు వద్దు...కావాలంతే ఒక నెలో రెండు నెల్లో సరదాగా అలా తిరిగేసి మల్ళీ వచ్చి బ్లాగు రాయండి.

Wish you a wonderful new year!
మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు!

సవ్వడి said...

నేస్తం గారు! పర్వాలేదులెండి! చూసారుగా..:):)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..:):):)

సౌమ్య నిజమే..:):)
విజయనగరం బ్లాగర్ల గురించి వేరేగా రాద్దామనుకున్నాను. పూర్తి వివరాలు లేక ఇంకా పోస్ట పెద్దదవడంతో వదిలేసాను. మనం మనం ఒకటి కదా..:):):)
ఇక బ్లాగింగ్ అంటావా.. ఓ మూడు సంవత్సరాలు వదిలేయ్!
నీకు కూడా Wish you a wonderful new year!
చివరగా థాణ్క్యు సో మచ్........:):)

పరిమళం said...

కృష్ణ గారు ...బోల్డన్ని థాంకులు ....అంతా బావుంది కానీ ఈ ఐదు సంవత్సరాల గడువెంటండీ...ఒక వేళ ...అహ...మనలోమన మాట...కొందరు అంటున్నట్టు 2012 డిసెంబర్ లో యుగాంతం ఐపోతేనో :) :) మీరు మాట తప్పినవారు అవుతారు :) ఐనా నేను చూడండి ఈ నెలలో ఒక్క పోస్టు రాయక పోయినా ..మీకు చెబుతున్నా ....వీలున్నప్పుడు రాస్తూ ఉండండి ...నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

స్వాతి said...

Krishna గారికి,
ముందుగా నా బ్లాగు చదివినందుకు ధన్యవాదములు. నా పిచ్చి రాతలను చదివి స్పూరి పొందేవారు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించాలి. మరిన్ని పొస్టులతో మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ......

కొత్తపాళీ said...

It's been a year my friend. Start writing again

సవ్వడి said...

కొత్త పాళీ గారికి నమస్తే!
మీ కామెంట్ చూసిన వెంటనే ఆశ్చర్యం. తరువాత చెప్పలేనంత ఆనందం.:):):):):):) ఇంకా నేను గుర్తున్నందుకు.:)
పోస్టులు పెట్టడం గురుంచి మాత్రం ఇప్పుడే చెప్పలేను. కాని చూస్తాను... ప్రయత్నిస్తాను.
మీరు నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురువు గారు.:):)