31.7.10

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద



గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద


మహిమల మఱ్ఱాకు తెప్పపై తేలేటి.. గోవిందా హరి గోవింద

ఏడేడు లోకాల నేలేటి కోనేటి.. గోవిందా సిరి గోవింద

వైఖుంఠమే వదిలి వచ్చావు వరహాల.. గోవిందా హరి గోవింద

పుట్టలోన దాగి పాలు తాగిన పుడమి.. గోవిందా సిరి గోవింద

వకుల పర్ణశాల వర్ణాల వర్ధిల్లు.. గోవిందా హరి గోవింద

అలమేలు మంగమ్మ అందాల గంధాల.. గోవిందా సిరి గోవింద

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద " 2 "

నింగి నేల కలిసి సిరుల నిత్య కల్యాణాల.. గోవిందా హరి గోవింద

ఆనంద నిలయాన ఆనందమందించు.. గోవిందా సిరి గోవింద

గోవిందా........ గోవింద.

అడగడుగు దండాల అల వడ్డి కాసుల.. గోవిందా హరి గోవింద

ఆపద మొక్కుల అందరిని దరిచేర్చు.. గోవిందా సిరి గోవింద

వేంకటేశా........... శ్రీ వేంకటేశా నీవంటి దైవం లేదు.. గోవిందా హరి గోవింద

బ్రహ్మాండమంతటా వేంకటాద్రి వెలుగు.. గోవిందా సిరి గోవింద

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద

ఝుమ్మంది నాదం చిత్రంలోని ఓ మంచి పాట. దీనితో పాటు పెళ్లి పాట, లాలి పాట, సంక్రాంతి పాట కూడా నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలు వచ్చాయి కాని నేను ఇంకా ఇవే వింటున్నాను.

ఈ పాట నాకు బాగా నచ్చిన పాట. చిన్న చిన్న పదాలతో ఎంత అందంగా ఉంది కదా! శ్రీనివాసుడిని స్మరించుకోవడమే ఒక అందమైన అనుభవం. అటువంటిది ఇంత చక్కని పాటను మన మధుర గాయకుడు " బాలు " గారు పాడాక చెప్పేదేముంటుంది!

కొన్ని రోజుల క్రితం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. రోడ్ మీద నిల్చొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను.

నిజానికి ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా అని చూస్తుంటాను. పుస్తకాలు చదువుకోవచ్చని... కాని రూమ్ కి వెళ్లాలనిపించట్లేదు. అక్కడ చదవవలసిన చాలా ఉన్నాయి. కోతి కొమ్మచ్చి, " కొమ్మనాపల్లి " పడిలేచే కడలి తరంగం, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఒకటి ఉంది(ఈ పుస్తకం లైబ్రెరీ నుండి తెచ్చుకున్నది). ఇంకా రామాయణం కూడా చదువుతున్నాను. బాలకాండ చదివేసాను. ఇంకా ఆరు కాండాలు ఉన్నాయి.

అలాగని గ్రంధాలయం కి వెళ్లాలని అనిపించట్లేదు. అక్కడ కొమ్మనాపల్లి రచనలు లేవు. మిగతావారివి నాకు పెద్దగా ఎక్కవు. ఏం చేద్దాం అనుకుంటుంటే కనిపించిందో ఓ పెద్ద బస్సు. డాన్స్ చెయ్యాలనిపించింది. కాని చూసినవాళ్లకి పిచ్చి ఎక్కుతుతందని.... వాళ్లకోసం రిస్క్ తీసుకోలేదు. కనిపించిన బస్సు ఏదంటే... విశాలాంధ్ర వారి " సంచార పుస్తకాలయం ". వెంటనే దూరిపోయాను.

నేను ఏ బుక్ షాప్ కి వెళ్లినా మొదట చూసేది నవలలు, తరువాత వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఆ తరువాత మిగతావన్ని ఓ రౌండేసి చూస్తాను. ఇప్పుడు అలాగే వెళ్లాను. వికాస పుస్తకాల దగ్గర ఆగిపోయాను. ఓ రెండు మూడు కొనేయాలనిపించింది. పర్స్ తీసి చూస్తే రూ. 70/- ఉన్నాయి. చాలా ఎక్కువ కదా! వెంటనే " రేపు ఉంటుందా.. " అని వాడిని అడిగాను. " ఊ.. " అన్నాడు. మరి ATM కి వెళ్లకుండా ఆ 70/- లోనే 30/- తో " ఎంకి పాటలు " కొన్నాను. మనం కొనకుండానా... చెప్పండి.

తరువాత రోజు వెళ్లి " The Man Who Sold His Ferrari " తెలుగు అనువాదం కొన్నాను. ఇంకా " నాహం కర్తా, హరిః కర్తా " కొనేసాను. కేవలం రెండు అనుభవాల కోసమే కొన్నాను. అప్పుడు స్వాతి లో " సర్వ సంభవాం " పేరిట వచ్చినప్పుడు మొత్తం చదివాను. ఐనా కొన్నాను. చిత్రమైన విషయమేంటంటే... ఆ ముందురోజే మా అమ్మ, నాన్న స్వామి వారికి సేవ చెయ్యడానికి తిరుమల వెళ్లారు. వారం అక్కడే ఉంటారు. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే వాళ్లు అక్కడ ఉన్నప్పుడే చదివేయాలనుకున్నాను... చదివేసాను.






గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద.....

ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఒళ్లు పులకిస్తూనే ఉంది. కొన్ని చోట్ల కంట తడి పెట్టుకున్నాను. కొన్నిసార్లు విపరీతమైన ఆశ్చర్యం... మరి కొన్నిసార్లు ఏదో తన్మయత్వం. ఇంకా ఆ పుస్తక రచయిత లాగా మనం కూడా స్వామికి దగ్గర ఐపోతే ఎంత బావుణ్ణో అనిపించింది.

నేను కేవలం " పాలాభిషేకం ", " కాసుల హారం " ఈ రెండింటికోసమే కొన్నాను. పాలాభిషేకం మొదట చదవాలనుకున్నాను. కాని అది " నేరస్థుడెవరు " అన్న పేరుతో ఉండడం వల్ల అన్నీ తిరగేసి... అది దొరకక మళ్లీ మొదటి నుండి చదివాను. నిజానికి పాలాభిషేకానికి ఎక్కువ స్పందించి కాసుల హారం కి తక్కువ స్పందిస్తాను అని అనుకున్నాను. కాని దానికి విరుద్ధంగా జరిగింది. కాసుల హారం చదువుతున్నంతసేపు నా కళ్లు తడి అవుతూనే ఉన్నాయి. మధ్యలో రెండు పేజీలు మసకగానే చదివాను. ఇంచుమించుగా ఓ ఏడు ఎనిమిదిదిసార్లు నా కళ్లు తుడుచుకుని ఉంటాను. అది పూర్తయ్యేసరికి ముక్కు నుండి చక్కగా కారుతుంది.

కాసుల హారం గురించి క్లుప్తంగా... కేరళలోని ఓ నిరుపేద భక్తుడికి స్వామి వారు కలలోకి వచ్చి " నాకొక కాసుల హారం చేయించరా.. " అని అడుగుతాడు. అతను చూద్దాంలే అని అనుకుంటాడు. తరువాత రోజు మళ్లీ కలలోకి వస్తే... ఇంట్లోవాళ్లతో చర్చించి ఓ రాగి కాసుల హారం చేయిద్దాం అనుకుంటారు. కాని స్వామివారు మళ్లీ కలలోకి వచ్చి బంగారం ది కావాలంటారు. అప్పటినుంచి ఇంట్లో ఉన్నవారందరూ పిల్లలతో సహా మొత్తం ఇరవైమంది రోజుకు ఒకపూట తిని ఒకపూట పస్తు ఉండి, అందరూ ఏవో పనులు చేస్తుంటే... ఆరు నెలలకు రెండు కాసులు చేయించగలుగుతారు. ఇంకా 106 చేయించాలి. నేను " సర్వేశ్వరా... " అనుకున్నాను. క్షణంలోనే నవ్వు వచ్చింది. వేంకటరమణ మూర్తి గురించి చదువుతూ ఈశ్వరుడుని తలచుకోవడం... అంతలోనే " ఇద్దరికీ బేధం లేదు కదా! " అనుకున్నాను.



మహిమల మఱ్ఱాకు తెప్పపై తేలేటి.. గోవిందా హరి గోవింద.

ఏడేడు లోకాల నేలేటి కోనేటి.. గోవిందా సిరి గోవింద....



తరువాత వాళ్ల పరిస్థితి కాస్త మెరుగుపడి... మొత్తానికి 16 సంవత్సరాలకి పూర్తిగా కాసుల హారం చేయించగలుగుతారు. అప్పుడు శ్రీవారు మళ్లీ కలలోకి వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి " హారంతో నన్ను చూసుకోండి. " అని చెప్పారు. అంతే కాకుండా పలానా వ్యక్తిని కలిస్తే మీ పని అవుతుందని కలలోనే ఒకరిని చూపించారు. వీళ్లంతా తిరుమల చేరుకుని ప్రసాద్ గారికి మాట్లాడుతుండగా.. ఆ భక్తుడికి కలలో కనిపించిన వ్యక్తి గుర్తొచ్చి... ప్రసాద్ గారి చెయ్యి పట్టుకుని ఊపేస్తూ " మీరే మీరే... స్వామివారు మిమ్మల్నే చూపించారు " ఆనందంతో చెప్తుంటే ప్రసాద్ గారి కళ్లవెంట ఆనంద భాష్పాలు! ఎంత అదృష్టం కదండి. తరువాత ప్రసాద్ గారే అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు కూడా నాకళ్లు చెమ్మగిల్లాయి.

]

వైఖుంఠమే వదిలి వచ్చావు వరహాల.. గోవిందా హరి గోవింద


పుట్టలోన దాగి పాలు తాగిన పుడమి.. గోవిందా సిరి గోవింద....



పాలాభిషేకం గురించి క్లుప్తంగా... ప్రతి శుక్రవారం స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది. ఆరోజు కూడా ప్రసాద్ గారు, ఆయన భార్య గోపిక గారు, మరికొంత మంది భక్తులు కూర్చొన్నారు. అభిషేకం ప్రారంభించకుండా అర్చకులు, ఆలయ సిబ్బంది అటూ ఇటూ తిరుగుతూ గంగాళాలు మారుస్తున్నారు. ప్రసాద్ గారు అడిగినా విషయం మాత్రం చెప్పలేదు. మొత్తం అభిషేకం పూర్తి ఐయ్యాక బైటకువచ్చి ప్రసాద్ గారు అడిగారు. స్వామివారికి తెచ్చిన పాలు విరిగిపోయాయండి అని చెప్పారు. వెంటనే డైరీకి ఫోన్ చేసి మళ్లీ తెప్పించాం. అవి కూడా విరిగిపోయాయి. అన్నారు. "డైరీలో బాగానే ఉన్నాయి. ఆలయంలోకి వచ్చేసరికి విరిగిపోయాయి" అని చెప్పారు. అలాగే భక్తులు తెచ్చినవి కూడా ఆలయంలోకి తీసుకురాగానే విరిగిపోయాయి అని చెప్పారు. ప్రసాద్ గారికి కోపం వచ్చి డైరీ వాడిని డిస్మిస్ చేసేసారు. అప్పుడు అక్కడకి గోపిక గారు ఏడుస్తూ వచ్చారు. "స్వామి అభిషేకానికని కొన్న పాలు ఇంట్లోనే మరచిపోయానండి." అంటూ కన్నీరు కారుస్తున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది " మీరు అభిషేకానికే కొన్నారా... మీ పాలతోనే అభిషేకం చేసామండి " అని చెప్పారు. అంతే విషయం అర్థమైపోయింది. ఆవిడ ఆనందంగా శ్రీవారిని దర్శించుకోవడానికి పరుగెడుతూ వెళ్లిపోయారు. అసలు విషయం ఏంటంటే వీళ్లు పాలాభిషేకం చేయించాలని ఎప్పుడో మొక్కుకున్నారు. కాని రోజూ మరచిపోతున్నారు. అందుకే స్వామివారే పాలను తెప్పించుకున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే.... ఒకే డైరీ నుండి వచ్చిన పాలు వీళ్లవి కాకుండా మిగతావన్ని ఎందుకు విరిగిపోయాయి. దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు.

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద.....



మా అమ్మ, నాన్న ఇంకా తిరుమలలోనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం శ్రీవారి దర్శనం చేసుకుని సాయంత్రం ఎనిమిది గంటల ట్రైన్ కి బయలుదేరుతున్నారు. వాళ్లు తిరుమలలో ఉండగానే పోస్ట్ కూడా పెట్టాలనుకున్నాను. పెట్టేసాను. గత నెలరోజులుగా ఏ పోస్ట్ పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. చిత్రం... నిన్న ప్రారంభించి ఈరోజు పోస్ట్ పెట్టేసాను. ఎలా సాధ్యమైంది... అందుకే " నాహం కర్తా, హరిః కర్తా " అన్నారు. నా అభిప్రాయం అదే!

వకుల పర్ణశాల వర్ణాల వర్ధిల్లు.. గోవిందా హరి గోవింద


అలమేలు మంగమ్మ అందాల గంధాల.. గోవిందా సిరి గోవింద

గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద

19.6.10

బంగారు వాన

నిజంగానే అందమైన వాన. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని వాన.


మా అమ్మవాళ్లు ముగ్గురు. మా అమ్మ పెద్ద. ఇద్దరు పిన్నిలు. పెద్ద పిన్ని పేరు " ఉమ ". రెండో పిన్ని పేరు " సావిత్రి ". ఇంట్లో అందరూ " సాయి " అనే పిలుస్తారు. మేము " సాయి పిన్ని " అని పిలుస్తాం. మా ఇద్దరు పిన్నిలు కలిసి బంగారం గాజులు మా ఊళ్ళోనే చేయించుకున్నారు. అవి తెమ్మని ఫోన్ చేస్తే బయలుదేరానన్నమాట. మా ఉమా పిన్నివాళ్లు చిక్కోలు ( శ్రీకాకుళం పాత పేరు )లో ఉంటున్నారు. అక్కడికి బయలుదేరాను. ఈ ప్రయాణం నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు జరిగింది.

ఉదయం టిఫిన్ చేసి... గాజులను రహస్య జేబు( సీక్రెట్ పాకెట్ )లో పెట్టుకుని పదిన్నరకి మెయిన్ రోడ్ మీదకి చేరుకున్నాను. ఐదు నిమషాల్లోనే express( దీన్ని తెలుగులో టైప్ చేస్తుంటే వచ్చి చావట్లేదు ) వచ్చింది. ఎక్కి కిటికీ పక్క సీట్ లో కూర్చున్నాను. అప్పటికి వర్షం లేదు.

పావుగంటలో బైపాస్ దాటి NH - 5 పైకి చేరుకున్నాం. మరో ఐదు నిమషాలు గడిచాక తొలకరి పారంభమైంది. " అబ్బా! ఇప్పుడే పడాలా... " అంటూ విసుక్కున్నాను. వెంటనే " ఇప్పుడే పడనీ! దిగినప్పుడు పడకపోతే చాలు. " అని దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను.పడ్డాక చేసేదేం లేదు కాబట్టి చూడడం ప్రారంభించాను. నాకు తడవడమే కాదు.. చూడడం కూడా ఇష్టమే!

జల్లుగా మొదలైన వాన మదిలోన ఆలోచనలను చెరిపేసి... వానగా మారి మనసంతా ఆక్రమించేసింది. నా మనసేమో నన్ను ఒంటరిగా వదిలి చినుకులతో కలిసి చిందులు వేస్తోంది.

నా మనసును అలా వదిలేసి.. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను చూసాను. ఎక్కువ మంది లేరు. ఓ పదిహేనుమంది దాకా ఉన్నారేమో! " ఈ వర్షంతో మాకేం సంబంధం లేదు " అన్నట్లుగా అద్దాలన్నీ మూసేసుకున్నారు. " చి.. దున్నపోతులు. వర్షాన్ని ఎంజాయ్ చెయ్యట్లేదు. వేస్ట్... " అని తిట్టుకున్నాను. అప్పుడు తిట్టిన తిట్లు గుర్తు రాక ఇప్పుడు తిట్టిన తిట్లు ఇవి... ఏమీ అనుకోకండి.

నేను మాత్రం అద్దాలను ముయ్యలేదు. రెండు గంటల ప్రయాణంలో ఒకే ఒక్కసారి మూసాను. మరీ ఎక్కువగా రావడంతో మూసాను. మళ్లీ వెంటనే తీసేసాను.

వర్షంలో తడుస్తున్న మొక్కలను, చెట్లను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. అదే సమయంలో ఈర్ష్య కూడా! " ప్రతి వర్షం మాదే... " అనుకుని అవి ఎంజాయ్ చేస్తుంటే.. మనమేమో చూస్తూ ఊరుకోవడంతోనే సరిపోతుంది. అప్పుడప్పుడు " వాటిలాగే పుట్టాల్సింది " అని కూడా అనిపిస్తుంది.

ఇక వర్షం వెలిసాక... నిర్మలంగా కనిపించే ఆకాశంలో ప్రతీది ఎంతో సహజంగా, స్వచ్చంగా కనిపిస్తుంది. నాకైతే ఈ మొక్కలు, ఇంత పెద్ద చెట్లు.. " ఇప్పుడే పుట్టాయా " అనిపిస్తుంది.

మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవగానే ఊరి మధ్యలో ఉన్న మా కాలేజీని ఊరు అవతలకి తీసుకెళ్లిపోయారు. పెద్ద తోటను కొనేసి అందులోనే కట్టేసారు. కాలేజి నిండా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లే! మా యాజమాన్యం మా కాలేజ్ కి " గ్రీన్ కేంపస్ " అని పేరు పెట్టింది.

వర్షా కాలంలో మా కాలేజి నుండి వచ్చేటప్పుడు సైకిల్ ని నెమ్మదిగా తొక్కుతూ దారిలో ఉండే మొక్కలను పరిశీలిస్తూ వచ్చేవాడిని. ప్రతి మొక్క ముత్యాలను అద్దుకున్నట్లు చినుకులతో మెరిసిపోయేది. మనసుకి ఎంత ఆనందంగా ఉండేదో...


ఇక ఈ ప్రయాణంలో చిగురాకుల నుంచి కొమ్మల నుంచి జారే ప్రతి చినుకు ఓ స్వప్నం లా అనిపించేది. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి చినుకు తన అస్థిత్వాన్ని కోల్పొయి... ఓ క్షణం పాటు... ఓ ఆకుకో, పువ్వుకో లేకపోతే మరో దానికి అందాన్నిస్తూ భువిలో ఐక్యమైపోవడం కలలా లేదు! అందుకే చినుకులు పడుతున్నాయి అనేకన్నా కలలు పడుతున్నయి అనడం నాకిష్టం.


మా ఊరు నుంచి చిక్కోలు వెళ్ళే దారిలో రెండు ప్లేసులు ఇష్టం. నేను బైక్ మీద వెళ్లేటప్పుడు ఈ రెండు స్థలాల్లోనా ఆగిన సందర్భాలున్నాయి. అందులో ఒకటి రోడ్ పక్కనే ఉన్న పెద్ద చెఱువు.. వర్షాకాలం కాబట్టి చెఱువులో నీళ్లు రోడ్ తో సమానంగా ఉన్నాయి. చిన్న కెరటాలు పరవళ్లు తొక్కుతూ అంచును తాకుతూ బైటకు వచ్చేవి. నాకైతే అవి రోడ్ తో సైయ్యాట ఆడుతున్నట్లు అనిపించింది. అక్కడే ఉండిపోవాలనిపించింది.

బస్సు ఆగలేదు. తప్పదు కదా! అనుకుని ముందుకు సాగుతున్నాను.

రెండో ప్లేస్ గురించి చెప్పే ముందు NH - 5 గురించి చెప్తాను వినండి. విశాలంగా ఉంటుంది. వన్ వే కాబట్టి ఎదురుగా ఏం రావు. డ్రైవ్ ని ఎంజాయ్ చెయ్యాలనుకుంటే ఈ రోడ్ బాగుంటుంది.

మొన్న సంక్రాంతికి మా మావయ్య, తమ్ముడు వైజాగ్ నుండి పలాస వరకూ కారులో కేవలం రెండుగంటల్లో వెళ్లారు. అదే బస్సులో ఐతే ఐదు గంటల జర్నీ. ఉదయం 7-30 కి బయలదేరినవాళ్లు 9-30 కి మా మావయ్య వాళ్ల అత్తవారింట్లో ఉన్నారు. కారు మావయ్య స్నేహితుడిది. మా మావయ్యకు కూడా ఇక్కడ కారు ఉందనుకోండి. మా కుటుంబాల్లో కారు కలిగిన ఏకైక వ్యక్తి. ఈ మావయ్య గురించి తరువాత చెప్తాను.

ఇప్పుడు రెండో ప్లేస్ గురించి చెప్తాను వినండి. వర్షం.. విశాలంగా ఉన్న రోడ్.... రోడ్ కి ఎడమ వైపున ఓ నలఫై, యాభై అడుగుల దూరంలో కొండ. కొండ వరకూ ఉన్న ప్రదేశమంతా పచ్చగా... రకరకాల ఆకారాలతో ఉన్న రాళ్లు... మధ్యలో నేను. లేకపోతే మిమ్మల్ని మీరు ఊహించుకోండి.



ఆకాశగంగ దూకావే పెంకితనంగా... ఆకాశగంగ

జల జల జడిగా తొలి అలజడిగా

తడబడు అడుగా నిలబడు సరిగా

నా తలపు ముడి వేస్తున్నా నిన్ను ఆపగా... " ఆకాశగంగ "




హలో! నేను పాడుతుంది వర్షం కోసమే... హీరోయిన్ కోసం కాదు. మీ సంగతి మాత్రం నాకు డౌటే!

పైది ఊహే.. కాని ఈ ఊహని నిజం చేసుకోవచ్చు.

నాకు వాన సినిమాలో బాగా ఇష్టమైన పాట ఇది.




మూతి ముడుచుకున్నది మువ్వంటి మైన

అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన

మాట వరసకైనా తనకి చెప్పనంటూ... గీటుదాటకన్నా లెక్కచేయనంటూ....

ఆమె గారి చెయ్యి జారి మనసు గాని పారిపోయిందా ఏమైనా... రానందా రమ్మన్నా... " మూతి ముడుచుకున్నది "



ఈ సినిమా పాటలు వినేటప్పుడు మొదట ఇదే వింటాను. మళ్లీ చివర ఇదే వింటాను. కాని ఈ పాట సినిమాలో లేదు. ఆడియోలో మాత్రమే లభ్యం.

ఇక ఈ సినిమా నాకు నచ్చలేదు. నాయికానాయికిలను కలపలేదు. ఈ కథలో అమ్మాయి ప్రేమలో పడడానికి మంచి బేస్ ఉంది. అటువంటప్పుడు కలపాల్సిందే. కలపలేదు... పోయింది. వానను ఆధారంగా చేసుకుని వచ్చిన " వర్షం " మరీ చెత్త. నాకు అస్సలు నచ్చలేదు.

వానతో సూపర్ లవ్ స్టోరీస్ రాయొచ్చు. ఓ " గోదావరి ", ఓ " ఏ మాయ చేసావే " వీటికి మించిన రేంజ్ లో రాయొచ్చు. చూద్దాం ఎవరైనా రాస్తారేమో! సినిమా గోల ఇప్పుడు ఎందుకులే!

సాధారణంగా మనకి బస్సు ఎక్కిన అరగంటకే నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే గంట తరువాతైనా వచ్చేస్తుంది. ఏదో ఒక టైమ్ లో రావల్సిందే! అటువంటిది ఈ ప్రయాణం మొత్తం మీద నాకు కనీసం నిద్ర మత్తు కూడా రాలేదు. వర్షం ఎంత మైమరిపించింది కదా! మొత్తం ప్రయాణంలో మూడు సార్లు నన్ను చినుకులు తాకాయి. మొదటసారి పలకరించినప్పుడు చల్లని పులకరింతతో ఒళ్లు ఝల్లుమంది. మరోసారి అల్లరిగా కవ్విస్తే.. ఇంకోసారి చిలిపిగా చక్కిలిగింతలు పెట్టాయి. ఇది నిజమేనండోయ్.. మొత్తం మూడు సార్లు బస్సులోనకి దూరి నన్ను మరిపించాయి... ప్రతీసారీ ఓ కొత్త భావం. ఆవిధంగా నేను ఎంజాయ్ చేస్తూ చిక్కోలు చేరుకున్నాను. నేను దిగేసరికి సగం సీట్ తడిసిపోయింది. ఎవరైనా తిట్టుకుంటారేమో అనుకున్నాను. " ఆ... తిట్టుకుంటే తిట్టుకున్నారులే వాళ్ల కర్మ. " అనుకుని దిగిపోయాను.

నేను దిగినప్పటికి కూడా వర్షం కుండపోతలా పడుతూనే ఉంది. వర్షం నాకు ఎంత ఇష్టమో వర్షాకాలం నాకు అంతగా నచ్చదు. ఎందుకంటే రోడ్లన్నీ బురదతో కనువిందుగా ఉంటాయి కాబట్టి. ఇక మీరు బ్రతికుండగానే నరకం చూడాలనుకుంటే మా ఊరి కూరగాయల మార్కెట్ కి వచ్చేయండి. ఫ్రీగా నరకం చూసేయొచ్చు. నాకు తెలిసి ప్రతీ ఊరిలోనా మార్కెట్ ఇలాగే ఉంటుందనుకుంటా!

" ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలో " అనుకుంటున్నాను. కాంప్లెక్స్ బైటకి రాగానే చిన్న సైజు స్విమ్మింగ్ ఫూల్ కనిపించింది. " దేవుడా... " అనుకున్నాను. వర్షం తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించలేదు. ఇక తప్పదులే అనుకుని ఆ స్విమ్మింగ్ ఫూల్ దాటి రోడ్ మీదకు వచ్చాను. అదృష్టంకొద్దీ ఆటో వెంటనే దొరికింది. అక్కడ నుంచి మా చిన్నాన్న వాళ్ల షాప్ దగ్గర దిగాను.

క్షేమ సమాచారాలు తెలుసుకున్నాక.. మా చిన్నాన్న ఇంటికి ఫోన్ చేసి... మా చెల్లి కి గొడుగు పట్టుకుని రమ్మన్నారు. ఓ అరగంటలో మా చెల్లి వచ్చింది. గొడుగు పట్టుకుని ఇంటికి బయలుదేరాను. మధ్యలో ఓ టర్నింగ్ దగ్గర కాలువ నుంచి నీరు వస్తూ రోడ్ మొత్తం ఆక్రమించేసాయి. నల్లగా నిగనిగలాడుతున్నాయి అనుకోండి. అది దాటితే గాని వెళ్లలేం. " చి.. యాక్............. " అనుకుని అడుగు వేసాం. అది దాటాక ఎర్రగా మెరిసిపోతూ బురద నీరు కనిపించాయి. అందులోనే కాళ్లు కడుక్కుని... మెల్లగా ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరిన వెంటనే పిన్ని తవ్వాలు ఇచ్చింది. బట్టలు మొత్తం తడిసిపోయాయి. మార్చుకోమని చిన్నాన్న లుంగీ ఇచ్చింది. ఏక్చువల్ గా నేను లుంగీ కట్టను. కాని ఇలా విధి వక్రిస్తున్నప్పుడు... తప్పదు. ఆ తరువాత గాజులు తీసి పిన్నికి ఇచ్చేసాను. అదీ కథ.

ఇప్పుడు వానకి థాంక్స్ చెప్పాలా.. బంగారానికి థాంక్స్ చెప్పాలా!

15.5.10

డేట్ అంటే..

ఒకే నెలలో ఒకే పేరుతో రెండు టపాలు పెట్టిన ఘనత నాకు దక్కింది. అర్జెంటుగా మీరంతా కలిసి నన్ను గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే. " గిన్నె, బుక్ రెండూ రెడీ.. నువ్వు రావడమే ఆలస్యం. " అంటారా.. నేను ఒప్పుకోనబ్బా! సరేలే విషయానికొద్దాం.


డేట్ అంటే డేటింగ్. " చ! మాకు తెలీదు మరి " అనుకుంటున్నారా.. సరే ఐతే డేటింగ్ కి అర్థం చెప్తా.. డేటింగ్ అంటే కలిసి తిరగడం. అంతే అంతకు మించి ఇంకేం లేదు. " అంత తేలిగ్గా చెప్పేస్తున్నావేంటిరా బాబు ! " అనకండి. చెప్తాను.

అసలు డేటింగ్ గురించి ఏం చెప్పాలి అని కొంతసేపు ఆలోచించాను. ఏవో కొన్ని విషయాలు తెలుసు. వాటిని చెప్పేస్తే చాలు. కాని ఏ ఉపోద్ఘాతం లేకుండా చెప్పెస్తే ఎలా అనిపించింది. ఏదో కొంత ముందు చెప్పి తరువాత విషయంలోకి వెళ్లాలి. ఆ విషయం ఏంటి అని ఆలోచించాను కాని దొరకలేదు. కాబట్టి వెళ్దాం.

డేటింగ్ రెండు రకాలు. మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇప్పుడు ఆశ్చర్యపోండి. చెప్పినా ఆశ్చర్యపోరా.. సరే మీ ఇష్టం.

డేటింగ్ రకాలు. 1. Indian Dating, 2. Foreign Dating. మన డేటింగ్ లో అమ్మాయి, అబ్బాయి కలిసి తిరగడం వరకే ఉంటుంది. వాళ్ల డేటింగ్ లో అన్నీ ఉంటాయి. ఇదీ తేడా! దీనికి మించి చెప్పడానికి ఏం లేదు. " సరే ఐతే... ఒక అమ్మాయి, అబ్బాయి తిరిగినంత మాత్రాన డేటింగ్ ఐపోతుందా " అని అడగాలనుకుంటున్నారా... అవదు. ప్రేమికులు తిరిగేదాన్ని డేటింగ్ అనరు. తిరగడమే అంటారు. వాళ్లు ఎలా తిరిగినా సరే( నేనైతే అలాగే అనుకుంటున్నాను. మరి నాకు తెలీదు )! డేటింగ్ అని ఎప్పుడంటారంటే.. ఒకొరికొకరు పరిచయం మాత్రమే ఉండి.. ఎదుటివాళ్ల గురించి తెలుసుకోవడానికి కలిసి తిరగడాన్ని డేటింగ్ అంటారు. నాకు తెలియక అడుగుతాను.. ఒకొరికొకరి గురించి తెలుసుకోవడానికి ఎక్కడో ఒకదగ్గర ఓ గంట కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది. దానికి తిరిగిడం ఎందుకు?

వెంగళప్ప దీర్ఘంగా ఆలోచిస్తూ తన స్నేహితుడు దగ్గరకు వెళ్లాడు. " ఎందుకు అలా విచారంగా ఉన్నావు " అని స్నేహితుడు అడిగాడు. " నా girl friend డేటింగ్ కి రమ్మందిరా " అని చెప్పాడు. " దానికి బాద పడతావెందుకు వెళ్లు. " అన్నాడు రెండో వాడు. " నేను కూడా వస్తాను అనే చెప్పాను " అన్నాడు వెంగళప్ప. " డబ్బులు లేవా.. నేను ఇస్తానుగా! " " డబ్బులు కూడా ఉన్నాయి. కాని ఆ డేటింగే... ఎక్కడుందో తెలీదు. " అన్నాడు. డేటింగ్ ఎక్కడుందో తెలియని రెండో వెంగళప్ప తీవ్రంగా కలత చెంది అప్పటికప్పుడే ఆలోచించి ఓ గొప్ప సలహా ఇచ్చాడు. " మనకైతే తెలియదు కాని అందరికీ తెలియదా... మీ ఇంట్లో వాళ్లని అడిగి వాళ్లనీ తీసుకెళ్లు. " అని చెప్పాడు.

సదరు వెంగళప్పలా కాకుండా అన్నీ తెలుసుకుని, ముందు జాగ్రత్తలు తీసుకుని వెళ్లండి.

డేటింగ్ కి వెళ్లే అమ్మాయిలు తీసుకోవల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. చెప్తాను వినండి. డేటింగ్ కెళ్లేటప్పుడు ఎవరితోనూ చెప్పకుండా వెళ్లొద్దు. చేసేది రాచకార్యం కాబట్టి ఎవరితో చెప్పం కాని క్లోజ్ ఫ్రెండ్ తో చెప్పండి. ఆ స్నేహితురాలితో పలానా టైమ్ లో వచ్చేస్తాను అని చెప్పండి. రాకపోతే వెంటనే ఫోన్ చెయ్యమనండి. ఆ ఫోన్ తో తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వెళ్లిన గంటకే ఫోన్ చేయమని చెప్పండి. మీకు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా ఆ కాల్ తో తప్పించుకోవచ్చు. ఇవి ముఖ్యమైనవి. ఇంత మంచి విషయాలు నాకెలా తెలిసాయి అనుకుంటున్నారా.. మొన్నే వసుంధరలో ఇచ్చాడులెండి. ఆవిధంగా డేటింగ్ రెండు రకాలని తెలిసింది.

అబ్బాయిలకు ఏ జాగ్రత్తలు ఇవ్వలేదబ్బా! నాకు తెలిసి వాళ్లకు ఉంటాయి. అవేంటో నాకు తెలీదు.

డేటింగ్ కెళ్లినవాళ్లు ఎంతమంది ప్రేమలో పడుతున్నారో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. వాటి అంతిమ లక్ష్యం మాత్రం మరింత సన్నిహితులు కావడం. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే.. ఈ డేటింగ్ కెళ్లేవాళ్లు, the so called great ప్రేమికులు ఒకొరి గురించి ఒకరు తెలుసుకుని, సరదాగా కాలాన్ని గడుపుతూ, ఎంతో ఆనందంగా జీవిస్తూ పెళ్లి చేసుకుని జీవితంలోకి శూన్యాన్ని ఆహ్వానిస్తున్నారేమో అనిపిస్తుంది. అంతే కదా! పెళ్లి తరువాత మాట్లాడుకోవడానికి ఇంకో విషయం ఉండదు. అన్నీ ముందే మాట్లేడేసి ఉంటారు. మరి సరదాలకి చోటెక్కడిది. అందుకే ప్రేమలో పడ్డాక ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అని నా అభిప్రాయం. అంతే కాదండోయ్.. ప్రేమ పెళ్లిలో యాభై లాభాలు ఉంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎనభై లాభాలు ఉంటాయి.

ఇదంతా విన్నాక నేను డేటింగ్ కి వ్యతిరేఖమనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. ఇప్పటికే ఈ బంపర్ ఆఫర్ ఇద్దరికి ఇచ్చేసాను. వాళ్లు సఖీన, జెస్సీ.

8.5.10

డేట్ అంటే....

ఈ పెద్దోలు ఉన్నారే... మా చిన్నవాళ్ల మనసులను అస్సలు అర్థం చేసుకోరు. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. లేకపోతే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అదేం ఆనందమో అర్థం కాదు. వాళ్ల పిల్లలు ఎలా ఉన్నా కాని పక్కంటి పిల్లల తెలివితేటలు మాత్రం కావాలి. అవి తెలుసుకుని వాళ్లు ఏం సాధిస్తారో నాకైతే తెలీదు.


మన తెలివితేటలు చెప్పేముందు ఇప్పుడు పిల్లల తెలివితేటలు గురించి తెలుసుకుందాం. మా బుల్లి రాక్షసి గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇక్కడ చూడండి.

వేసవి కాలం కదా.. మధ్యాహ్నం సమయంలో ఇంటి తలుపులు వేసి అందరం లోనే ఉన్నాం. మా తల్లిగారు అన్నీ ఆడేసి.. ఏమీ తోచక " షికారుకి ఎ....ళ్దాం " అంటూ ఏడుపు అందుకుంది. తనకి షికారు అంటే చాలా ఇష్టం. తెల్లవారినుంచి రాత్రి వరకూ తిరిగి ఇంటికొచ్చినా... పది నిమషాల్లో " షికారుకి ఎ...ళ్దామా... " అంటాది. మేము కోపంగా "ఎంతసేపైందే బైటకెళ్లొచ్చి " అని అడిగితే.. మళ్లీ అదే మాట " షికారుకి ఎ...ళ్దామా... " అంటుంది. ఇంకేం చేస్తాం.. ముద్దులు పెట్టేసి వదిలేస్తాం.

అలాంటి రాక్షసి మామూల టైమ్ లో అడిగితే ఉండగలమా.. " సాయంత్రం వెళ్దాంలే " అన్నాను. వినదు. నేను కాస్త తగ్గి " తరువాత వెళ్దాంలే " అన్నాను. తన శ్రుతిని ఇంకా పెంచింది. మరి లాభం లేదని మా బావతో " ఒరేయ్! దీన్ని బైటకి తీసుకెళ్లురా " అన్నాను. ఎప్పుడు బైటకి వెళ్దామా అని చూసే మా బావ.. పరీక్షలుండడంతో " నేను చదువుకోవాలిరా " అనేసి గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు.

వేరే దారి లేక మా తల్లిగారిని తీసుకెళ్దామనుకుని తనని ఎత్తుకుంటుండగా.. బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. " తలుపులు వేసే ఉన్నాయి. రానట్లు నటించిస్తే సరిపోతుంది. " అని తలుపుల దగ్గరకు వెళ్లి " ఊ... " అంటూ గట్టిగా తలుపు లాగినట్లు ప్రయత్నించి " రావట్లేదు తల్లి! తరువాత వెళ్దాం. " అన్నాను. వెంటనే తళాల వైపు చూపిస్తూ " తాళం " అంది. కేలండర్ స్టాండ్ కి తాళాలు వేళాడుతుంటాయి. వాటిని చూపిస్తూ.. " పదా.. " అంది. తన తెలివికి సంబరపడిపోతూ " ఓసి రాక్షసి! తలుపులు రాకపోతే తాళాలు తాయాలని కూడా తెలుసన్నమాట. " అన్నాను నవ్వుతూ! అదేమో తాళాలనే చూపిస్తుంటే " నాకు తీయడం రాదు తల్లి! " అన్నాను. వెంటనే "నెను తీసాను( నేను తీస్తాను ) అంది. ఏనంత ఉంది కాని( తనకిప్పుడు రెండు సంవత్సరాలు ) ఎంత తెలివి అనుకుంటూ దాని బుగ్గలు కొరికేసి బైటకి తీసుకెళ్లాను. ఇదే విషయం రాత్రి మా మావయ్యతో చెబితే " నిజమా.. " అంటూ ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు మన తెలివి గురించి చెప్తాను వినండి. మనకి అసాధారణమైన తెలివితేటలతో పాటు అత్భుతమైన మేధోశక్తి కూడా ఉందనమాట. ఇక లెక్కల్లో ఐతే కింగ్... రెండు చాక్లైట్లు పావలా ఐతే పదహారు చాక్లైట్లుకి ఎంత ఇవ్వాలి అని అడిగారు అనుకో ఓ అరగంట మేథోమథనం చేస్తే గాని చెప్పలేం. అలాంటి నన్ను.. మరీ దారుణంగా రూపాయి ముప్పవులా లెక్క అడిగారు. ఒక టేబ్లెట్ రూపాయి ముప్పావులా ఐతే ఎనిమిది ఎంత అని అడిగారొకసారి. పావలా లెక్కకే అరగంట ఆలోచించిన మనం.. ఈ లెక్కకి ఓ రెండు గంటలు తీవ్రమైన మేధోమధనం చేసాక సమాధానం చెప్పాను. సరిగ్గానే చెప్పాను. నా జీవితంలో నేను కరక్ట్ గా చెప్పిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అందులో ఇది ఒకటి.

ఇక్కడొక సరదా విషయం.. మా మావయ్య వాళ్లకి కిరాణా షాప్ ఉంది. సెలవుల్లో అప్పుడప్పుడు వెళ్లి హెల్ప్ చేసేవాడిని. ఎప్పుడైనా లెక్క తప్పు పెడితే " ఏం రా.. మీ లెక్కల మేస్ట్ చదువుకోలేదా! " అనేవారు. ఒకవేళ తనే తప్పు చేస్తే " ఏం చేస్తామండి మా లెక్కల మేస్ట్ చదువుకోలేదు " అనేవారు సరదాగా! అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వేవాళ్లు.

సందర్భం : పైన చెప్పిన విషయం.. నేను ఆరో ఏడో చదువుతున్నప్పుడు మా నాన్నగారికి జ్వరం చేస్తే నేను మాతర్లు తెచ్చి డబ్బులు తిరిగి ఇచ్చినప్పుడు నా లెక్కలపై అనుమానమొచ్చి నాకో ప్రశ్న అడిగిన సందర్భం లోనిది.

ఇక అసలు విషయానికి వద్దాం. న్యూటన్ " చర్య - ప్రతిచర్య "సూత్రాన్ని కనిపెట్టినట్లు, ఐనస్టీన్ " సాపేక్ష సిద్ధాంతం " కనిపెట్టినట్లు ( ఇప్పూడీ సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటో అడక్కండి. నాకస్స...లు తెలీదు ) నేను ఒక విషయం కనిపెట్టేసాను. కాకపోతే అప్పటికే ఈ విషయం ప్రపంచానికి తెలుసు.

నేనప్పుడు రెండో తరగతి చదువుతున్నాను. అప్పట్లో మాకు కూడా షాప్ ఉంది. ఇంటిలోనే షాప్ అన్నమాట. మా షాప్ ముందు నుయ్యి ఉంది. దాని మీద కూర్చున్నాను(తలుపులు ఉన్నాయిలెండి). ఏం చేస్తున్నానో గుర్తు లేదు. ఆ సమయంలో ఏదో అవసరమై మా పక్కింటి అంకుల్ వచ్చి అది కొనుక్కొని.. పక్కనే ఉన్న నన్ను చూసి నా తెలివితేటలని పరీక్షించాలనుకున్నారు. ఇంకేముంది అడిగేసారు. " ఈ పెద్దవాళ్లు తిన్నగా ఉండరు కదా! " అనుకున్నాను. అతను " ఈరోజు డేట్ ఎంత అని " అడిగారు.

" డేటా............................................ " అంటూ పెద్ద ఆశ్చర్యంలో మునిగిపోయాను. అప్పటివరకూ నేనా పదమే వినలేదు. " డేట్ అంటే ఏం చెప్పాలి... అదేమైనా పదమా, వాఖ్యమా, నెంబరా.. లేకపోతే పద్యమా.. ఏం చెప్పాలి. " అనుకుంటూ బిక్కమొహం వేసుకుని అతన్ని, మా నాన్నగారిని కలిపి అటూ, ఇటూ చూస్తున్నాను. డేట్ అంటే ఎవరికి తెలుసు.. మీరే చెప్పండి. సైన్స్ విద్యార్థిని ఎకౌంట్స్ గురించి అడిగితే ఏం చెప్తాడు. అదీ నా పరిస్థితి.

తన కొడుకు నిరూపమాన తెలివితేటలు ఎక్కడ బైట పడిపోతాయో అనుకుని మా నాన్నగారు " 8 అని చెప్పు నాన " అన్నారు. అంతే ఒక అత్భుతం ఆవిష్క్రతం ఐపోయింది. నేను డేట్ ని కనిపెట్టేసాను. డేట్ అంటే నెంబర్ చెప్పాలి. " నెంబర్ చెప్పాలి.. నెంబర్ చెప్పాలి. " అని రెండుసార్లు నెమరువేసుకుని అక్కడనుండి ఇంటిలోనకి వెళ్లిపోయాను. అతను నా గురించి ఏమన్నారో మరి నాకు తెలీదు.

అప్పటినుంచి నేను ఒక డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈరోజు 8, రేపు 9... ఇలా పెరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులు పోయాక డేట్ 100 వస్తుంది. దాన్ని చూసేయాలి అన్న సంతోషంలో ఉంటే ఎప్పటికీ రాలేదు. ఈ పెద్దోలున్నారే 100 డేట్ ని కూడా రానివ్వరు.