13.12.09

అమ్మబాబోయ్

అమ్మబాబోయ్ అనిపించింది. ఎప్పుడంటారా నా మొదటి టపా టైప్ చేస్తున్నప్పుడు.

            మొదటి టపాని బాగా రాయాలని బాగా ఆలోచించి ఒక నోట్స్ తీసుకుని అప్పుడు కొంత.. అప్పుడు కొంత లెక్క ఒక ఐదు.. ఆరు రోజులు రాసాను. అంతా చూసుకున్నాక ఇక టైప్ చేయొచ్చు అని నిర్ణయం తీసుకుని.. తూర్పుకి ఎదురుగా కూర్చుని (నిజమేనండి బాబు) పుస్తకాన్ని పక్కన పెట్టుకుని టైప్ చేయడం ప్రారంభించాను. తూర్పుకి ఎదురుగా ఐతే కూర్చున్నాను గాని దేవుడుకి దండం పెట్టలేదు.

           నాలుగు ఐదు లైన్లు ఉత్సాహంగా టైప్ చేసాను. అప్పటకి మెల్లగా సీన్ అర్థమౌతుంది. ఐనా మొదటి టపా కదా సరదా తగ్గలేదు. మరో నాలుగు లైన్లు టైప్ చేసేసరికి ఆ సరదా కూడా పోయింది. ఇంకా రెండు పేజీలకు పైగా ఉండేసరికి... మహేష్ బాబు కొట్టకుండానే నాకు మైండ్ బ్లాంక్ ఐంది. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. " దేవుడా.." అనుకుని టైప్ చేస్తున్నాను.

          అలా సాగుతుండగా ఒక దగ్గర "చేసేదే" బదులు "చెసేదే" అని టైప్ చేసాను. 'చె' తీసేద్దామని చూస్తే అది కాస్త "చసేదే" ఐంది. నా సహనం కూడా పోవడానికి సిద్ధంగా ఉంది. సరేలే అనుకుని 'చ' కి 'E' కలిపితే 'చే' అవుతుంది కదా అని టైప్ చేస్తే.. అది కాస్త "చఏసేదే" ఐంది. నా సహనమూ పోయింది. మళ్లీ 'చఏ' ని డిలీట్ చేసి 'చే' అని రాసేసరికి దేవుడు కనిపించాడు. ఆ సమయంలో పుస్తకాన్ని చూసేసరికి అదేమో కొండలా కనిపించింది. నాకు ముక్కోటి దేవతలు గిర్రున తిరిగి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు.

          ఆ విధంగా నేను తప్పు టైప్ చేసిన ప్రతీసారీ దేవుళ్లందరూ కలిసికట్టుగా ప్రత్యక్షమవడం ప్రారంభించారు.( ఎంత పుణ్యమో అనుకుంటున్నారా.. మీకే ఇస్తున్నా తీసుకోండి)

         ఆదివారం సమయం 1-40 దాటింది. ఓ పాడుబడ్డ మేడ దగ్గర సన్నని గోడ మీద ఓ కొంగ ఒంటి కాలు మీద నిల్చుని జపం చేస్తుంది.

          అది అక్కడ జపం చేస్తుంటే.. నేను ఇంట్లో నా టపాని టైప్ చేస్తున్నాను. కొన్ని తప్పులతో మరి కొంత సమయం విసుక్కుంటూ సగం పూర్తి చేసేసరికి.. " ఒరేయ్ భొజనానికి రా! " అంటూ మా అత్తయ్య పిలుపు.( వాళ్ల ఇంటిలోనే ఉన్నాను. రేపు వేరే రూమ్ కి వెళ్లిపోతున్నా!) " దేవుడా.." అని మరోసారి తలుచుకుని లేప్ టాప్ ని లాక్ చేసాను. ఈ ఆటంకాలేంటి అనుకుంటూ... " అసలు వీళ్లంతా ఎలా టైప్ చేసేస్తున్నారో.." అని బ్లాగులోకంలో బ్లాగులు రాస్తున్నవారందరిపైనా కుళ్లుకున్నాను( కోపమొస్తోందా... కానివ్వండి ).

        భోజనం చేసిన తరువాత కూడా దేవుళ్లను తలచుకుంటూ... బ్లాగుర్ల సహనాన్ని మెచ్చుకుంటూ(కాదు తిడుతూ ఏమో).. మిగతాదాన్ని టైప్ చేసి పోస్ట్ చేసాను. వెంటనే అనుకున్న మాట "హమ్మయ్య" అని.

        ఒక రోజు ఐనంతవరకూ ఒక్క కామెంట్ రాలేదు. దానితో నా కామెంట్ బాక్స్ పని చేస్తుందో లెదో అని సాయంత్రం నెట్ సెంటర్ కి వెళ్లి ఓపెన్ చేసి "just for cheking" అని టైప్ చేసాను. అది కనిపించింది. అప్పుడు చూసాను. అప్పటికే "పద్మార్పిత" గారు కామెంట్ చేసారు. నేను అదేం చూడకుండా కామెంట్ చేసినందుకు " ఛీ సరిగ్గా చూడొచ్చు కదా! గాబరెక్కువ " అని నాకు నేనే తిట్టుకున్నాను. ఆ తరువాత మిగతా వారి కామెంట్లు కూడా వచ్చాయి.

           ఇదంతా చదివాక నాపై "నేస్తం" గారి ప్రభావం ఉన్నట్టునిపిస్తుంది కదా! మీకు అనిపించినా అనిపించకపోయినా నాకు మాత్రం తెలుస్తోంది. ఆవిడ ప్రభావం నాపై ఉన్నట్లు.

           నేను కథలు వ్రాస్తాను( ఎప్పటికైనా రచయితగానే స్థిరపడాలనుకుంటున్నాను ). నా అభిమాన రచయిత "కొమ్మనాపల్లి గణపతి రావు గారు". ఆయన ఆర్థ్రత, కరుణ రసాలు బాగా వ్రాస్తారు. అవి నేను వ్రాయలేనులెండి.

          ఇంకా ఆయన ఒక పాత్ర ప్రవర్తనకు నాలుగు.. ఐదు.. కారణాలు వివరిస్తాడు. అందులో ఏదో ఒకటి అయుంటుందని చెప్తాడు. అలా ప్రతీ పాత్రకీ వివరిస్తాడు.

          అలా నేను ప్రయత్నించానులెండి. నా కథల్లో నేను కూడా ఓ రెండు కారణాలను వివరించగలిగాను. అదంతా ఆయన ప్రభావమే!ఇప్పుడు "నేస్తం" గారి ప్రభావం కూడా అదే స్థాయిలో ఉందనిపిస్తుంది.

         మరో విషయం ఏంటంటే నా పేరు నా బ్లాగు చిరునామాలో ఉంది. దాంతోనే పిలవండి... మీరు, గారు... అటువంటివేం వద్దు.

         ఇందాకల నుంచి కొంగ గురించి తెగ ఆలోచిస్తున్నట్లున్నారు. సమాధానం తెలిసిందా.. తలియలేదా.. పోనీలెండి నేనే చెప్పేస్తాను. చెప్పేస్తున్నా.. ఎందుకు నిల్చుందంటే.. దాని ఇష్టమండి. ఒంటి కాలుపై కాకపోతే ఒంటి వేలు మీద నిల్చుంటుంది. మీకెందుకు! అన్నా.. ఊరుకుంటుంటే అన్నీ అడిగేస్తున్నారే!

10 comments:

సుభద్ర said...

బాగు౦ది..నేను అ౦తే ము౦దు ఓ రఫ్ చేసుకుని అప్పుడు మొదలు పెడతా పోస్ట్..
ఈ మద్య చూద్దా౦ అని డైరెక్టు గా రాశానా...........తప్పులు తడక అయ్యి౦ది..
నాకు మొదట్లో మీలానే కొన్ని అక్షరాలు వచ్చేవి కావు..సో దానికి పర్యాయపద౦ కోస౦ నేను జప౦ చేసేదాన్ని..ఇప్పుడు ఓకే అని నాకు నేను అనుకు౦టున్నాను..బాగా రాశారు..
ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.

Praveena said...

Nice post.Keep writing more.

cartheek said...

saradaaga undi krishna...

పరిమళం said...

:) :) All the best!

భావన said...

nice one. Good luck... ;-)

విశ్వ ప్రేమికుడు said...

బాగున్నాయి మీ కష్టాలు కృష్ణా. ఎంత మంచిపేరు పెట్టుకున్నారు. నాకు చాలా ఇష్టమైన పేరు.

మీ టైపాట్లు తప్పాలంటే ముందు కొంతకాలం లేఖినిలో టైప్ చెయ్యండి. అదీ నిదానంగా చెయ్యాలి. అలా లేఖినిలో తప్పులు లేకుండా టైప్ చెయ్యడం వచ్చిన తరువాత బరహా ప్రయత్నించండి. నిదానం అనే మాట మర్చిపోకండి. మీరు ఆరభంలో ఎంత నిదానంగా సాధన చేస్తే తరువాతి కాలంలో అంత త్వరత్వరగా టైప్ చెయ్యగలుగుతారు.

టపా బాగుంది. :)

జయ said...

బాగుందండి. మీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. కొంచెం ఫాంట్ పెంచొచ్చు కదా. మా లాంటివాళ్ళం కూడా మీ బ్లాగ్ కి ఒస్తున్నామండి. All the best.

సవ్వడి said...

సుభద్ర గారు నా బ్లాగులోనకి వచ్చినందుకు ధన్యవాదాలు. నేనే అనుకున్నాను... అలా నోట్స్ రాసుకుని పోస్ట్ చేసేది. మీరు అంతేనా! అసలు డైరక్ట్ గా రాసేవారు ఎన్ని పాట్లు పడతారో కదా! నా కోరికను దీవించినందుకు ధన్యవాదాలు.

ప్రవీణ గారు థాంక్స్.

కార్తీక్ గారు థాంక్స్.

పరిమళ గారు మీక్కూడా థాంక్స్.

భావన గారు మీక్కూడ..

విశ్వప్రేమికుడు గారు నా బ్లాగు పేరు నచ్చినందుకు ధన్యవాదాలు. నాకు బాగా నచ్చింది ఆ పేరు.. అందుకే పెట్టుకున్నా! టపా నచ్చినందుకు థాంక్స్.

మరో విషయం ఏంటంటే నేను యంత్రం లో టైప్ చేస్తున్నాను. లేఖిని కన్నా చాలా బాగుంది. లేఖిని లో నాలుగు లైన్లు ఐయ్యాక పదం మొత్తం టైప్ చేసాకే మారుతుంది. ఇందులో అలా కాదు.. ఎన్ని పేజీలు టైప్ చేసినా అక్షరం ఐనవెంటనే మారిపోతుంది( ఐనా నాకు ఆ పాట్లు తప్పలేదులెండి ). యంత్రం ఓపెన్ చేసాక భాషను ఎంచుకోండి. తరువాత కుడివైపున.. పైన "టైపింగ్ సహాయం", "టైపింగ్ పాడ్" అని రెండు ఉంటాయి. మొదటి దానిని చూసాక రెండవ దాన్ని తీసుకుని.. మీ ఇష్టం. దాని చిరునామా.. yantrhram.com

జయ గారు నాబ్లాగుకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే ఫాంట్ సైజ్ పెంచాను. ఆశీర్వదించినందుకు అభివందనాలు.

సిరిసిరిమువ్వ said...

మీ వ్రాతలతో భలే సవ్వడి చేస్తున్నారుగా. మీ బ్లాగు చూస్తుంటే పచ్చటి పంటపొలాలు చూసినంత ఆహ్లాదంగా ఉంది. All the best.

"ఒక దగ్గర "చేసేదే" బదులు "చెసేదే" అని టైప్ చేసాను. 'చె' తీసేద్దామని చూస్తే అది కాస్త "చసేదే" ఐంది. నా సహనం కూడా పోవడానికి సిద్ధంగా ఉంది. సరేలే అనుకుని 'చ' కి 'E' కలిపితే 'చే' అవుతుంది కదా అని టైప్ చేస్తే.. అది కాస్త "చఏసేదే" ఐంది. నా సహనమూ పోయింది. మళ్లీ 'చఏ' ని డిలీట్ చేసి 'చే' అని రాసేసరికి దేవుడు కనిపించాడు"......ఎంత సహనమండి బాబూ మీకు:) అదంతా గుర్తుపెట్టుకుని మరీ వ్రాసారు.

సవ్వడి said...

మువ్వ గారు! మీకు ఆహ్లాదంగా కనిపించినందుకు సంతోషంగా ఉంది. నా బ్లాగులోనకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక అదంతా నాకు గుర్తుండటానికి అప్పుడు నేను పడిన ఇబ్బందే కారణం.